అర్ధరాత్రి.. మృతదేహాన్ని 11 కి.మీ. ఈడ్చుకెళ్లిన కారు

బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడి (35)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. యువకుడు రోడ్డు మధ్యభాగంలో పడిపోగా.. శరవేగంతో వచ్చిన మరో కారు అతడి పైనుంచి వెళ్లింది.

Published : 08 Feb 2023 04:50 IST

బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడి (35)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. యువకుడు రోడ్డు మధ్యభాగంలో పడిపోగా.. శరవేగంతో వచ్చిన మరో కారు అతడి పైనుంచి వెళ్లింది. కింది భాగంలో చిక్కుకుపోయిన అతణ్ని సుమారు 11 కిలోమీటర్ల వరకు కారు అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో యువకుడు మృతిచెందగా.. శరీరం ఛిద్రమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర వద్ద సోమవారం అర్ధరాత్రి నోయిడా - ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ దారుణ ప్రమాదం జరిగింది. కారు మాట్‌ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నాక అక్కడున్న సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కారు నడిపిన వ్యక్తి ఆగ్రాలో ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొని తన కుటుంబంతో కలిసి నొయిడాకు తిరిగి వస్తున్నట్లు సీనియర్‌ ఎస్పీ వెల్లడించారు. మంచు దట్టంగా ఉండటంతో మృతదేహం కారు కింద ఇరుక్కున్నట్లు తనకు తెలియలేదని డ్రైవరు చెప్పాడని వివరించారు. మృతుడి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

యాచకుణ్ని ఢీకొట్టి లాక్కెళ్లిన కారు

రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పుర్‌ జిల్లాలోనూ మరో ఘోరం జరిగింది. ఘంటాఘర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు యాచకుడు హేమరాజ్‌ పైనుంచి దూసుకెళ్లి.. 200 మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. ఫిబ్రవరి 4న ఈ ఘటన జరిగినట్లు  ఘంటాఘర్‌ పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుణ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు