సంక్షిప్త వార్తలు (9)

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో బుధవారం ఫోన్‌లో సంభాషించాను. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య బహుముఖ మైత్రిని మరింత బలోపేతం చేయడం, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం పెంచడం, రక్షణ, భద్రతల్లో సహకారం గురించి చర్చలు జరిపాం.

Updated : 09 Feb 2023 09:57 IST

రూ.25 లక్షల బ్యాగు పోలీసులకు చేర్చిన రిక్షావాలా

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రిక్షావాలా రూ.25 లక్షల నగదుతో తనకు దొరికిన బ్యాగును పోలీసులకు అందించి నిజాయతీ చాటుకున్నారు. గాజియాబాద్‌లోని మోదీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన మహ్మద్‌ మంగళవారం తన ఈ-రిక్షాపై వెళ్తుండగా రూ.25 లక్షల నగదుతో ఉన్న బ్యాగు దొరికింది. ఈ బ్యాగును మహ్మద్‌ పోలీసులకు అందించగా.. ఆయన నిజాయతీని మెచ్చి వారు సత్కరించారు. ఈ డబ్బు ఎవరిదనే విషయం ఆరా తీస్తున్నట్లు రూరల్‌ డీసీపీ రవికుమార్‌ తెలిపారు.


పులుల అభయారణ్యాల ప్రధాన ప్రాంతాల్లో నిర్మాణాలు వద్దు: సుప్రీం

దిల్లీ: పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాల్లోని ప్రధాన ప్రాంతాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాల లోపల జంతుప్రదర్శన శాలలు, సఫారీలు నెలకొల్పటాన్ని తప్పుపడుతూ....వాటిని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందో వివరించాలని ఆదేశించింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ)కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ పులుల అభయారణ్యం పరిధిలో సఫారీ నిర్మాణాన్ని అక్రమంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపింది.


మసీదుల్లో మహిళల ప్రవేశం నిషిద్ధం కాదు
సుప్రీంకోర్టుకు తెలిపిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌

దిల్లీ: మసీదుల్లో నమాజు చదువుకునేందుకు మహిళల ప్రవేశానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనల కోసం స్వేచ్ఛగా మసీదుల్లోకి రావచ్చని, ఈ హక్కును ఉపయోగించుకోవడం వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో బోర్డు ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. నమాజు కోసం మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశాన్ని అనుమతించాలన్న పిటిషను విచారణలో భాగంగా బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయితే, పూర్తిగా ప్రయివేటు నిర్వహణలో ఉండే మసీదులు ముతవల్లీల ఆధ్వర్యంలో నడుస్తాయని, ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం వారు నడుచుకుంటారని న్యాయవాది ఎం.ఆర్‌.షంషాద్‌ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోర్టుకు బోర్డు నివేదించింది. 2020లో ఫర్హా అన్వర్‌ హుసేన్‌ షేక్‌ ఈ పిటిషను దాఖలు చేశారు. భారత్‌లోని మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా అని పిటిషనరు వాదించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషనుపై పూర్తిస్థాయి విచారణను మార్చి నెలలో చేపట్టే అవకాశముంది.  


నాలుగు హైకోర్టు సీజే పదవుల నియామకానికి కొలీజియం సిఫార్సు

దిల్లీ: పట్నా, హిమాచల్‌ ప్రదేశ్‌, గువాహటి, త్రిపుర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల(సీజే)నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తూ సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నాయకత్వంలోని త్రిసభ్య కొలీజియం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేరళ ఉన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ను పట్నా హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ సబీనాను అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. ఝార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను త్రిపుర హైకోర్టు సీజే స్థానానికి ప్రతిపాదించింది. రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సందీప్‌ మెహతాను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.


మాన్‌సరోవర్‌ యాత్ర ఈ ఏడాదీ లేనట్టే!

పితోర్‌గఢ్‌: ఉత్తరాఖండ్‌లో ఏటా నిర్వహించే కైలాస్‌ - మాన్‌సరోవర్‌ యాత్ర ఈసారీ లేనట్లేనని తెలుస్తోంది. జూన్‌ మొదటి వారంలో జరిగే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు విదేశాంగశాఖ నుంచి నోడల్‌ ఏజెన్సీకి ఎలాంటి సమాచారం అందలేదు. పితోర్‌గఢ్‌ జిల్లాలోని లిపులేఖ్‌ పాస్‌ మీదుగా జరిగే ఈ యాత్రను కొవిడ్‌ కారణంగా 2020 నుంచి నిలిపివేశారు. ఈ ఏడాది మానసరోవర యాత్రకు బదులుగా ఆది కైలాస్‌ యాత్రను నిర్వహించనున్నట్లు కుమావూ మండల్‌ వికాస్‌ నిగమ్‌(కేఎమ్‌వీఎన్‌) అధికారి వాజ్‌పేయీ తెలిపారు. ఈ యాత్ర మే మొదటి వారం నుంచి నవంబరు మొదటి వారం వరకు జరగనుంది.


14న గోవులను హత్తుకొనే దినోత్సవం

దిల్లీ: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 14న గోవులను హత్తుకొనే దినోత్సవం(కౌ హగ్‌ డే) నిర్వహించాలని కేంద్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పరిధిలోని జాతీయ పశు సంక్షేమ సంస్థ అధికారులు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. తల్లిలాంటి గోవులను హత్తుకోవడం వల్ల ‘సానుకూల ప్రేరణాత్మక శక్తి వ్యాప్తి చెందుతుందని.. వ్యక్తిగత, సామూహిక ఆనందాలు సాకారం అవుతాయని’ పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వైదిక సంప్రదాయాలు, మన వారసత్వాలు అంతరించిపోతున్నాయని గుర్తు చేశారు. ఏటా ప్రేమికుల దినోత్సవం (వేలంటైన్స్‌ డే) జరుపుకొనే ఫిబ్రవరి 14వ తేదీనే ‘కౌ హగ్‌ డే’ కూడా రావడం గమనార్హం.


త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో హెల్త్‌ ఏటీఎంలు

లఖ్‌నవూ: రాష్ట్రంలో హెల్త్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇండియా హెల్త్‌ లింక్‌ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. 4,600కి పైగా ప్రాథమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో హెచ్‌ పాడ్‌ అని పిలిచే ఈ ఏటీఎంలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఉపయోగించి బీపీ, బరువు, నాడి, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటి 20 ప్రాథమిక ఆరోగ్య పారామితుల వివరాలు పొందొచ్చని, కేవలం 10 నిమిషాల్లో ఏటీఎం సదరు వ్యక్తికి హెల్త్‌ రిపోర్టు అందిస్తుందని ఈ సంస్థ తెలిపింది.


పంజాబ్‌ సరిహద్దులో డ్రోన్‌ కూల్చివేత

దిల్లీ: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మంగళవారం అర్ధరాత్రి ఓ డ్రోన్‌ కలకలం రేపింది. అమృత్‌సర్‌ సెక్టార్‌లోని బాబాపిర్‌ ప్రాంతంలో బుధవారం భారత సరిహద్దుల నుంచి పాకిస్థాన్‌ వైపు ఆ డ్రోన్‌ వెళ్తుండగా బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్పులు జరిపాయి. డ్రోన్‌ శకలాలు పాకిస్థాన్‌ భూభాగంలో పడినట్లు అధికారులు తెలిపారు.


ఇజ్రాయెల్‌తో బలమైన భాగస్వామ్యంపై చర్చ

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో బుధవారం ఫోన్‌లో సంభాషించాను. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య బహుముఖ మైత్రిని మరింత బలోపేతం చేయడం, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం పెంచడం, రక్షణ, భద్రతల్లో సహకారం గురించి చర్చలు జరిపాం. 

 నరేంద్ర మోదీ


పిల్లల్ని చంపుతున్నట్లు వారికి తెలియదా?

భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేలో శిథిలాల కింద ఇరుక్కుపోయిన పిల్లల ఆర్తనాదాలు గుండెలను పిండేస్తున్నాయి. ఒక్కో చిన్నారిని సురక్షితంగా బయటకు తీస్తున్నప్పుడు సహాయక సిబ్బంది మొహాల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. కొందరు నిర్దయగా నగరాలపై బాంబులు ఎలా వేయగలుగుతున్నారా అన్న ఆశ్చర్యం కలుగుతోంది. పిల్లలను చంపుతున్నట్లు వారికి తెలియదా?

 శేఖర్‌ కపూర్‌


అవి దేశంపై జరిగిన దాడులు

దేశంలో యూపీఏ హయాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు సంబంధించి ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు. మోదీజీ.. అవి దేశంపై జరిగిన దాడులు. వాటిని పార్టీల కోణంలో చూడొద్దు. పుల్వామా, ఉరీ, పఠాన్‌కోట్‌ ఘటనలను మేము భాజపా ఆమోదిత ఉగ్రదాడులుగా చూడటం లేదు కదా. 

 శశిథరూర్‌


మన ఎంపికలపై అప్రమత్తత అవసరం

మన ఆరోగ్యం కోసం మనం కట్టుబడి ఉండా లి. అప్పుడే మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై స్పృహ కలిగి ఉంటాం. మన ఆరోగ్యం మన ఎంపికల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. 

 జగ్గీ వాసుదేవ్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు