ప్రజా విశ్వాసమే నా రక్షణ కవచం

దేశ ప్రజల ఆశీర్వాదం తనకు అతిపెద్ద రక్షణ కవచమనీ, తిట్లు- అబద్ధాలు- నిందలతో విమర్శకులు దానికి గండి కొట్టలేరని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 09 Feb 2023 06:05 IST

అబద్ధాలు, నిందలతో దానికి గండి కొట్టలేరు
ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిన యూపీయే
నిర్మాణాత్మక విమర్శలకు బదులు ఆరోపణలతోనే సరి
ప్రతిపక్షాలపై లోక్‌సభలో మోదీ ఎదురుదాడి
ఈడీకి విపక్ష నేతలు ధన్యవాదాలు తెలపాలన్న ప్రధాని

ఈనాడు, దిల్లీ: దేశ ప్రజల ఆశీర్వాదం తనకు అతిపెద్ద రక్షణ కవచమనీ, తిట్లు- అబద్ధాలు- నిందలతో విమర్శకులు దానికి గండి కొట్టలేరని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం లోక్‌సభలో ఆయన సమాధానమిచ్చారు. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలకు, ఆయనతో తన స్నేహానికి ముడిపెడుతూ విపక్షాలు చేసిన విమర్శలపై ఎదురుదాడి చేశారు. సుమారు గంటన్నరపాటు చేసిన ప్రసంగంలో ఆయన ఒకవైపు తన ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరిస్తూనే యూపీయే పాలనపై దుమ్మెత్తిపోశారు.

యూపీయే పాలన కుంభకోణాలమయం

‘‘యూపీయే పాలన భారత చరిత్రలో అది అతిపెద్ద కుంభకోణాల కాలంగా నిలిచిపోయింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రదాడుల పరంపర కొనసాగింది. ఆ దశాబ్దంలో భారత్‌ గొంతు ప్రపంచ వేదికలపై బలహీనపడిపోయింది. ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిన ఘనత యూపీయేకి దక్కుతుంది. ఐటీ యుగం వెలుగుతున్నప్పుడు 2జీ కుంభకోణంలో, పౌర అణు ఒప్పంద సమయంలో ‘ఓటుకు నోటు’లో ఇరుక్కుపోయారు. 2010లో కామన్‌వెల్త్‌ క్రీడల్లో యువత సామర్థ్యం ప్రపంచం ముందు చాటే సమయంలో కుంభకోణంలో ఇరుక్కుపోయి దేశానికి అపకీర్తి తెచ్చారు. 2008 ఉగ్రదాడిని ఎవరూ మరిచిపోలేరు.

విమర్శ చాలా గొప్పది

ప్రజాస్వామ్యంలో విమర్శ చాలా గొప్పదని నేను భావిస్తాను. శతాబ్దాలుగా ప్రజాస్వామ్యం మన రక్తంలో కలిసిపోయింది. ప్రజాస్వామ్య బలోపేతానికి, స్ఫూర్తికి విమర్శ ఒక సాధనం. తొమ్మిదేళ్లలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శ చేస్తారని, దానివల్ల దేశానికి మేలు జరుగుతుందని భావించాను. వాళ్లు తప్పుడు ఆరోపణలు మినహా ఇంకేం చేయలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పించారు. తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై, అవినీతిపై దర్యాప్తు జరిగితే దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు మొదలుపెట్టారు. సైన్యంపై విమర్శలు గుప్పించడం అలవాటు చేసుకున్నారు. విపక్షనేతలు ఈ విషయంలో పరస్పరం స్వరం కలిపారు. ఎన్నికల్లో ఓటములు ఇలాంటి వారందర్నీ ఏకం చేస్తాయని భావించాను. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈడీ కారణంగా అందరూ ఒక్కచోటుకు చేరారు. అందుకు ఈడీకి వారు ధన్యవాదాలు తెలపాలి. ఓటర్లు చేయలేని పనిని ఈడీ చేసి చూపింది.

కాంగ్రెస్‌ తిరోగమనంపైనా అధ్యయనం చేస్తాయి

భారత్‌ తిరోగమనం గురించి హార్వర్డ్‌ అధ్యయనం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. కాంగ్రెస్‌ ఉత్థాన పతనాల గురించి అదే యూనివర్శిటీ అధ్యయనం చేయడం విశేషం. భవిష్యత్తులో కాంగ్రెస్‌ తిరోగమనం గురించి పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేస్తాయని నేను నమ్ముతున్నాను. అహంకారంలో మునిగిపోయినవారు, అన్నీ మాకే తెలుసనే భ్రమల్లో ఉన్నవారు, మోదీపై విమర్శలు గుప్పించి తప్పించుకోవచ్చని అనుకుంటారు. ప్రపంచంలో మన దేశం బలహీనమైపోయిందని విమర్శించేవారే విదేశాల నిర్ణయాలను మనదేశం ప్రభావితం చేస్తోందనీ నిందిస్తున్నారు. దేశం బలమైనదా, బలహీనమైనదా అనేది విపక్షం తేల్చుకోవాలి.

మీ ఆరోపణల్ని ఎలా నమ్ముతారు?

నాపై విశ్వాసం పత్రికల్లో వార్తల ద్వారానో, టీవీల్లో మెరిసే మొహాల ద్వారానో రాలేదు. నాపై దేశ ప్రజల విశ్వాసం అందరి ఆలోచన పరిధి కంటే చాలా ఎత్తులో ఉంది. మీ (యూపీయే) కారణంగా దశాబ్దాల తరబడి కష్టాల్లో కాలం వెళ్లదీసిన కోట్లమంది భారతీయులు మీ ఆరోపణలను ఎలా నమ్ముతారు? అవినీతి, ఆశ్రితపక్షపాతం, విధానపరమైన నిష్క్రియాపరత్వంపై రాష్ట్రపతి ప్రసంగంలోని వ్యాఖ్యల గురించి సభలో కొందరు అభ్యంతరం చెబుతారని అనుకున్నాను. ఎవరూ వాటిని వ్యతిరేకించకపోవడం సంతోషం. ఆ మాటలన్నింటినీ సభ మొత్తం పూర్తిగా స్వీకరించినందుకు నేను 140 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

ప్రపంచం చూపు.. మనవైపు

వందేళ్లకోసారి వచ్చే భయంకర మహమ్మారి, మరోవైపు యుద్ధం కారణంగా ప్రపంచం విడిపోయిన పరిస్థితుల్లోనూ మనం నిలదొక్కుకొని నిలబడడంతో ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది. మనపట్ల ప్రపంచవ్యాప్తంగా సానుకూల వైఖరి నెలకొంది. భారత్‌ ఢంకా మోగడం ప్రారంభమైంది. ఇక్కడి కొందరికి అది కనిపించడంలేదు. ఎవరిలోనూ నిరాశ ఉత్తినే రాదు. ప్రజలు పదేపదే తిరస్కరిస్తుంటేనే అది వస్తుంది. 2014కి ముందు పదేళ్లు భారత్‌ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. దానివల్ల నిరాశ కాకుండా ఇంకేం వస్తుంది? వాళ్ల వైఖరి కారణంగానే ప్రజలు ఇంటికి పంపేశారు’’ అని మోదీ చెప్పారు. ‘ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌కు అందరూ వెళ్లివస్తున్నారు. గతంలో లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడం ఓ కలగా ఉండేది. ఆ పరిస్థితిని మేం మార్చాం’ అని తెలిపారు. అధికార పక్షం ‘మోదీ...మోదీ..’ అని, విపక్షం ‘అదానీ..అదానీ..’ అని పలుమార్లు నినదించాయి. మోదీ ప్రసంగం ముగిశాక కోరం సరిపోక లోక్‌సభను గురువారానికి వాయిదావేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ప్రధాని గురువారం రాజ్యసభలో సమాధానం ఇవ్వనున్నారు.

అదానీకి మోదీ అండ స్పష్టం: రాహుల్‌

అదానీపై విచారణకు ఆదేశించట్లేదంటే ఆయన్ని రక్షిస్తున్నది మోదీయేనని స్పష్టమవుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. తాను సంధించిన ఏ ప్రశ్నలకూ మోదీ సమాధానం చెప్పలేదన్నారు. వాస్తవమేంటో బయటపడిందనీ, ఒకవేళ అదానీ గానీ మోదీకి సన్నిహితుడు కాకపోతే ఆరోపణలపై విచారణకు ప్రధాని అంగీకరించేవారని చెప్పారు. ‘ఈ కుంభకోణం చాలా పెద్దది. ఆ విషయాన్నైనా ప్రధాని చెప్పలేదు. మోదీతో కలిసి అదానీ ఎన్నిసార్లు వెళ్లారు, ఎన్నిసార్లు వారిద్దరూ కలిశారనే చిన్న ప్రశ్నలనే నేనడిగాను. దానికే దిగ్భ్రాంతి చెందిన ప్రధాని.. సమాధానమే చెప్పట్లేదు’ అని విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు.


వ్యర్థ ప్లాస్టిక్‌ బాటిళ్లతో మోదీ నీలిరంగు జాకెట్‌

దిల్లీ: పార్లమెంటులో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ధరించిన నీలిరంగు జాకెట్‌ అందరినీ ఆకర్షించింది. కారణం.. వాడి పారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఆ జాకెట్‌ను తయారు చేయడమే. సోమవారం బెంగళూరులో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) నిర్వహించిన ‘ఇండియా ఎనర్జీ వీక్‌’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. అందులో ఈ నీలిరంగు జాకెట్‌ను.. ఐవోసీ ప్రధానికి బహూకరించింది. దీన్ని ధరించే బుధవారం ఆయన పార్లమెంటుకు వచ్చారు.సుమారు 28 బాటిళ్లతో ఒక వ్యక్తికి అవసరమైన దుస్తులు తయారవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు