ఆప్‌ సర్కారుపై సీబీఐ ఆరోపణలు

వివిధ శాఖల్లో అక్రమాలను తనిఖీ చేయడానికి ఆప్‌ సర్కారు నియమించిన ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను(ఎఫ్‌బీయూ) ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది.

Published : 09 Feb 2023 05:05 IST

ఎఫ్‌బీయూని రాజకీయంగా వాడుకున్నారని వ్యాఖ్య
మనీశ్‌ సిసోదియాపై చర్యలకు రాష్ట్రపతికి ఎల్‌జీ సక్సేనా అభ్యర్థన

దిల్లీ: వివిధ శాఖల్లో అక్రమాలను తనిఖీ చేయడానికి ఆప్‌ సర్కారు నియమించిన ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను(ఎఫ్‌బీయూ) ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది. ఇందులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పాత్ర అధికంగా ఉందని.. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లేకుండానే ఎఫ్‌బీయూలో అధికారులను నియమించారని సీబీఐ తప్పుపట్టింది. సిసోదియా, ఎఫ్‌బీయూ డైరెక్టర్‌తో పాటు ఇందులో పాత్ర ఉన్నవారిపై కేసులు నమోదు చేయడానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను సీబీఐ అభ్యర్థించింది. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతిని వీకే సక్సేనా కోరారు. ఎఫ్‌బీయూ దుర్వినియోగంపై స్పందించిన భాజపా.. సిసోదియాపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎల్‌జీ కార్యాలయం, మీడియా, వ్యాపారవేత్తలు, జడ్జీలపై నిఘా కోసమే ఎఫ్‌బీయూని కేజ్రీవాల్‌ ఏర్పాటు చేశారని ఆరోపించింది. మోదీ, ఆదానీ మధ్య ఉన్న సంబంధాలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని ఎద్దేవా చేస్తూ భాజపా ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ తిప్పికొట్టింది.

ఏమిటీ ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌..?  ప్రభుత్వంలోని వివిధ శాఖలు, అందులోని ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో సమాచారం సేకరించి.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించేదే ఈ ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌. దీన్ని 2015లో దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.కోటి నిధులతో 2016 నుంచి ఇది పని చేయడం ప్రారంభించింది. 60శాతం అవినీతికి సంబంధించి ఇది పనిచేస్తే.. 40శాతం రాజకీయ అవసరాలకు ఉపయోగపడిందని సీబీఐ ఆరోపించింది. రూ.36లక్షలు దీనికోసం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని