Overseas Education: భారతీయ విద్యార్థుల గమ్యస్థానాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌

భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం గత ఏడాది అత్యధికంగా అమెరికా సంయుక్తరాష్ట్రాలు, కెనడా, బ్రిటన్‌కు వెళ్లినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు.

Updated : 09 Feb 2023 08:36 IST

గత ఏడాది 68% మంది ఈ మూడు చోట్లకే పయనం

ఈనాడు, దిల్లీ: భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం గత ఏడాది అత్యధికంగా అమెరికా సంయుక్తరాష్ట్రాలు, కెనడా, బ్రిటన్‌కు వెళ్లినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు. 2022లో 7,50,365 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా అందులో 1,90,512 మంది అమెరికా, 1,85,955 మంది కెనడా, 1,32,709 మంది యూకేకి వెళ్లినట్లు చెప్పారు. బుధవారం రాజ్యసభలో కేరళ సభ్యుడు జోస్‌ కె.మణి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకూ ఉన్నత చదువులకోసం భారతీయ విద్యార్థులు వెళ్తున్నారని, అందులో 68% మంది ఈ మూడు దేశాలను ఎంచుకున్నారని వివరించారు. 2020, 2021ల్లో కలిపి 7,04,208 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా 2022లో ఒక్కటే 7,50,365 మంది వెళ్లారని చెప్పారు. ఆ రెండేళ్ల ఉమ్మడి సంఖ్యకంటే ఈ ఏడాది ఒక్కటే 6.55% మంది అధికంగా విదేశీబాట పట్టినట్లు వెల్లడించారు. వీటి తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, జర్మనీ, రష్యా, సింగపూర్‌, కిర్గిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, కజకస్థాన్‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌లు ఉన్నట్లు వెల్లడించారు.

ఇండియన్‌ మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌పై కసరత్తు!

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల తరహాలో ఇండియన్‌ మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ పేరిట ఓ కొత్త అఖిలభారత సర్వీసును ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఇండియన్‌ మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఏర్పాటుకోసం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి మాకు ఒక ప్రతిపాదన వచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వాలతోసహా భాగస్వాములందరితో చర్చించాల్సిన అవసరం ఉందని భావించి అందుకోసం ఆ ప్రతిపాదనను వైద్యఆరోగ్యశాఖకు తిప్పిపంపాం’’ అని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు