నా నియోజకవర్గంపై ప్రధాని కన్ను: ఖర్గే

‘‘ప్రధాని మోదీకి ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే. ఇపుడు ఆయన కన్ను నా నియోజకవర్గం కలబురగి (గుల్బర్గా)పై పడింది. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా, ఆయన అక్కడికి వెళ్లి రెండు సభలు పెట్టారు’’ అని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నపుడు సభలో ఉన్న మోదీ సహా సభ్యులందరూ నవ్వారు.

Updated : 09 Feb 2023 06:16 IST

సభలో నవ్వులు పూయించిన ప్రతిపక్ష నేత

దిల్లీ: ‘‘ప్రధాని మోదీకి ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే. ఇపుడు ఆయన కన్ను నా నియోజకవర్గం కలబురగి (గుల్బర్గా)పై పడింది. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా, ఆయన అక్కడికి వెళ్లి రెండు సభలు పెట్టారు’’ అని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నపుడు సభలో ఉన్న మోదీ సహా సభ్యులందరూ నవ్వారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గంటకు పైగా మాట్లాడిన ఖర్గే ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కూడా నవ్వించారు. ‘‘న్యాయవాదిగా ఉన్నపుడు డబ్బు చేతితో లెక్క పెట్టేవాడినని, అనుభవం పెరిగేకొద్దీ నోట్ల లెక్కింపు యంత్రం తీసుకువచ్చినట్టు ధన్‌ఖడ్‌ నాతో చెప్పారు’’ అని ఖర్గే అన్నపుడు.. ‘‘నేనలా చెప్పలేదు. మీరు నాపై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ సంఘం) ఏర్పాటు చేయిస్తారేమో!’’ అని జగదీప్‌ ధన్‌ఖడ్‌ సరదాగా స్పందించారు. దీంతో సభలో మళ్లీ నవ్వులు విరిశాయి. సభా నాయకుడైన పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకొంటూ.. ఆ లెక్కింపు కష్టాలు తగ్గాలనే డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ లెక్కింపు యంత్రం తెచ్చారని చెప్పారు. ఈ సమయంలో ప్రధాని కూడా సభలో ఉన్నారు. ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. హిండెన్‌బర్గ్‌ - అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు రుజువైనప్పుడే జేపీసీ ఏర్పాటుచేయడం సంప్రదాయమని గోయల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని