BBC: బీబీసీపై ఐటీ కన్ను

గోధ్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇటీవల ప్రసారం చేసిన ‘బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌’ (బీబీసీ)పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది.

Updated : 15 Feb 2023 07:32 IST

దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో సోదాలు
పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా
ల్యాప్‌టాప్‌లు, మొబైళ్ల స్వాధీనం
మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్నాళ్లకే చర్య!
తప్పుపట్టిన విపక్షం, ఎడిటర్స్‌ గిల్డ్‌, పాశ్చాత్య మీడియా సంస్థలు

దిల్లీ, లండన్‌: గోధ్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇటీవల ప్రసారం చేసిన ‘బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌’ (బీబీసీ)పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ఆ సంస్థ.. పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ముంబయి, దిల్లీల్లోని కార్యాలయాల్లో మంగళవారం సోదాలకు దిగింది. సిబ్బంది ఫోన్లన్నింటినీ ఒకచోట ఉంచాల్సిందిగా సూచించి, కొన్ని వివరాల సేకరణకు ప్రయత్నించింది. గుజరాత్‌ అల్లర్లలో మోదీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్‌చిట్‌ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని భాజపా అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఈ పరిణామాల నడుమ ఐటీ రంగంలోకి దిగడంపై రాజకీయ పార్టీలు, పాత్రికేయ సంఘాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని ఉసిగొల్పడం రివాజేననేది మరోసారి రుజువైందని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. భాజపా మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది.  

సోదాలు కావు.. సర్వేలే: ఐటీ శాఖ

ఉదయం 11 గంటలకు దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలకు ఐటీ అధికారులు చేరుకున్నారు. లండన్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు మన దేశంలోని కార్యాలయాల వ్యాపార లావాదేవీల పత్రాల కోసం ఆరా తీశారు. బీబీసీ అనుబంధ కంపెనీల పన్ను వివరాలపై దృష్టిపెట్టారు. ఇది పూర్తిగా బీబీసీ వ్యాపార లావాదేవీలకు సంబంధించినదేనని, సంస్థ ప్రమోటర్లు/ డైరెక్టర్ల నివాసాలపై సోదాలు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ పన్నులు, అనుబంధ కంపెనీలకు నిధుల బదలాయింపుపై విచారణ కోసమే సర్వే చేస్తున్నామని తెలిపాయి. గతంలోనే నోటీసులు పంపినా బీబీసీ తిరస్కారపూరితంగా వ్యవహరించిందనీ, పెద్దమొత్తంలో లాభాలను మళ్లించిందని ఆరోపించాయి. కొన్ని మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఓ కంప్యూటర్‌ జప్తు చేసినట్లు వెల్లడించాయి.

వినాశకాలే విపరీత బుద్ధి: కాంగ్రెస్‌

ఐటీ సోదాలు ప్రతీకార దాడిలా కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. వ్యతిరేక వార్తల్ని ప్రసారం చేసేవారిని బెదిరించి, గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నంగా భారాస, వామపక్షాలు పేర్కొన్నాయి. తాము అదానీ సమస్యపై జేపీసీ ద్వారా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేస్తుంటే.. అధికార పార్టీ మాత్రం బీబీసీ వెంట పడుతోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. విపక్షంపైనా, మీడియా మీద దాడులకు సంస్థల్ని వాడుకుంటుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను ప్రభుత్వ తీరు గుర్తు చేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మండిపడ్డారు. ప్రేమికుల దినోత్సవాన ఐటీ సర్వే మొదలైందని, ప్రభుత్వానికి ప్రీతిపాత్రుడైన మిస్టర్‌.ఎ విషయంలో ఐటీ, సెబీ, ఈడీ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని అదానీని దృష్టిలో పెట్టుకుని తృణమూల్‌ ప్రశ్నించింది. మోదీది నిరంకుశమని ఆప్‌ ఆరోపించింది. సీపీఐ, సీసీఎం కూడా ఐటీ సోదాల్ని ఖండించాయి. ఇంతవరకు దేశంలోని మీడియా సంస్థలపైనే ఐటీ, ఇతర సంస్థల సోదాలు సాగేవనీ, ఇప్పుడు దేశంలో పనిచేస్తున్న విదేశీ సంస్థలకూ అది విస్తరించిందని సీపీఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ మతఛాందస విధానాన్ని ఎండగట్టినవారిపై విషంగక్కి దాడులు చేస్తున్నారని సీపీఐ ఆరోపించింది.

కాంగ్రెస్‌ ఎజెండాకు సరిపోయేలా బీబీసీ: భాజపా

కాంగ్రెస్‌ ఆరోపణలను భాజపా ఖండించింది. తప్పు చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన సంస్థగా బీబీసీని అభివర్ణించింది. ‘దేశంపై విషం కక్కుతూ కాంగ్రెస్‌ ఎజెండాకు అనుగుణంగా ఇది పనిచేస్తోంది. ఐటీ శాఖ దాని పనిని అది చేసుకునేలా వదిలేయాలి. ఫలానా పనిని ఎప్పుడు చేయాలనేది ప్రభుత్వం గానీ, వెలుపలి శక్తిగానీ నిర్ణయించబోవు. బీబీసీ దుష్ప్రచారం కాంగ్రెస్‌ ఎజెండాకు చక్కగా సరిపోతుంది’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఎద్దేవా చేశారు. దేశంలో పనిచేసే ఏ సంస్థలైనా స్థానిక చట్టాలకు లోబడి ఉండాలన్నారు.

పాత్రికేయ సంఘాల అభ్యంతరం

ఐటీ సోదాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ఇది పరిష్కారమవుతుందని బీబీసీ ఆశాభావం వ్యక్తంచేసింది. బీబీసీపై ఐటీ చేపట్టిన సర్వేను ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ఖండించింది. అధికార పార్టీని విమర్శించే సంస్థల్ని ప్రభుత్వం వేధిస్తోందని చెప్పడానికి ఇదో తార్కాణమని తెలిపింది. ఇలాంటి సోదాలు చేసేటప్పుడు పాత్రికేయుల/ మీడియా సంస్థల హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని, ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలని పేర్కొంది. మీడియాను బెదిరించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ప్రభుత్వానికి ‘ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’ సూచించింది. కేంద్రం చర్యలను ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌’ (సీపీజే), ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి విదేశీ సంస్థలూ తప్పుబట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని