Supreme Court: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. క్లిష్టమైన రాజ్యాంగ అంశం

శివసేన పార్టీలో చీలికల అనంతరం మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం పర్యవసానాలు రాజ్యాంగపరంగా క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, వాటిపై తీసుకునే నిర్ణయం ప్రభావం.. రాజకీయాలపై చాలా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

Updated : 16 Feb 2023 10:11 IST

శివసేన చీలిక వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: శివసేన పార్టీలో చీలికల అనంతరం మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం పర్యవసానాలు రాజ్యాంగపరంగా క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, వాటిపై తీసుకునే నిర్ణయం ప్రభావం.. రాజకీయాలపై చాలా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే చేసిన వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విభేదించింది. ఇది కేవలం విద్యా విషయక కసరత్తు కాదని స్పష్టంచేసింది. ‘‘నబమ్‌ రబియా కేసులో 2016లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎవరైనా సులువుగా వెళ్లిపోవచ్చు. మరోవైపు చూస్తే.. ఒక రాజకీయ పార్టీ నేత తమవారిపై పట్టు కోల్పోయినా వారిని వెళ్లకుండా నిలువరించే అవకాశం ఉంది. రెండింటిలో దేనిని తీసుకున్నా రాజకీయ రంగంపై ప్రభావం పెద్దఎత్తున ఉంటుంది. అవి రెండూ వాంఛనీయం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. శివసేనలో తలెత్తిన చీలిక, కొందరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది.  ధర్మాసనంలో జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కొహ్లి, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా ఉన్నారు. గురువారం కూడా విచారణ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని