అప్పటికే పది మంది పిల్లలు.. భార్య కు.ని. శస్త్రచికిత్స చేయించుకుందని ఇంటినుంచి వెలివేసిన భర్త

అప్పటికే ఆ దంపతులకు పది మంది పిల్లలు.. అర్థాకలితో నెట్టుకొస్తున్న జీవితాలు.. వారి దయనీయ స్థితిని గమనించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం గృహిణికి ఆశా కార్యకర్తలు నచ్చజెప్పి చేయించారు.

Updated : 19 Feb 2023 09:21 IST

కటక్‌, న్యూస్‌టుడే: అప్పటికే ఆ దంపతులకు పది మంది పిల్లలు.. అర్థాకలితో నెట్టుకొస్తున్న జీవితాలు.. వారి దయనీయ స్థితిని గమనించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం గృహిణికి ఆశా కార్యకర్తలు నచ్చజెప్పి చేయించారు. విషయం తెలిసి భర్త భగ్గుమన్నాడు. ఇంటినుంచి భార్యను వెలివేశాడు. పిల్లలతో కలిసి మూడు రోజులుగా ఆ మాతృమూర్తి రోడ్డుపైనే గడుపుతున్నారు. ఈ సంఘటన ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా టెల్కోయి సమితి డిమిరియా గ్రామంలో చోటుచేసుకుంది. ఆధునిక సమాజంలో ఇంకా కొనసాగుతున్న విపరీత పోకడలకు ఇది దర్పణంగా నిలిచింది. గ్రామానికి చెందిన రవి దెహురి, జానకి దంపతులకు పది మంది పిల్లలు ఉండగా.. ఇటీవల మరోసారి కాన్పు అయింది. ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయాడు. జానకి తరచూ గర్భం దాల్చుతుండడంతో అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ఆశా కార్యకర్తల చొరవతో ఇటీవల కు.ని. శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. తన భార్యను రవి ఇంట్లోకి రానీయకుండా నిరోధిస్తూ పితృ దేవతలకు పూజలు చేయడానికి అనర్హురాలివయ్యావంటూ మండిపడ్డాడు. బయటకు గెంటేశాడు. లోపలకు వస్తే చంపేస్తానంటూ ఇంటి ముందు మారణాయుధాలతో కాపలా కాస్తున్నాడు. తల్లీపిల్లలకు ఆశా కార్యకర్తలే ఆహారం సమకూర్చుతున్నారు. ఆరోగ్య అధికారులు వచ్చి రవికి నచ్చజెప్పినప్పటికీ నిష్ఫలమైంది. తల్లీపిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి రవిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని