Operation Golden Dawn: ఆపరేషన్‌ గోల్డెన్‌ డాన్‌!

ఇండో-నేపాల్‌ సరిహద్దుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ‘ఆపరేషన్‌ గోల్డెన్‌ డాన్‌’ పేరుతో ఏకకాలంలో దాడులు చేశారు.

Updated : 22 Feb 2023 09:49 IST

దేశవ్యాప్తంగా స్మగ్లర్లపై దాడులు
100 కిలోలకు పైగా బంగారం స్వాధీనం

ముంబయి: ఇండో-నేపాల్‌ సరిహద్దుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ‘ఆపరేషన్‌ గోల్డెన్‌ డాన్‌’ పేరుతో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.51 కోట్ల విలువైన 100 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహారాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు మంగళవారం తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి పది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఏడుగురు సుడాన్‌ దేశస్థులు ఉన్నారు. పట్నా, పుణె, ముంబయిలతో పాటు ఇండో-నేపాల్‌ సరిహద్దులో తనిఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరెన్సీని సైతం సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ బంగారాన్ని ఎక్కువ భాగం పేస్ట్‌ రూపంలో ఇండో-నేపాల్‌ సరిహద్దు గుండా బిహార్‌ రాజధాని పట్నాకు తీసుకొచ్చారు. ఆపై రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా ముంబయికి రవాణా అవుతున్నట్లు  గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు సుడాన్‌ దేశస్థులను పట్నా రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలు ఎక్కుతున్న సమయంలో పట్టుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. వీరి వద్ద 37.126 కిలోల బంగారం పేస్ట్‌ లభ్యమైంది. స్లీవ్‌లెస్‌ జాకెట్‌లలో 40 పాకెట్లలో రహస్యంగా దాచిన బంగారాన్ని మరో ఇద్దరు సుడాన్‌ దేశస్థుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మూడో విదేశీయుడు సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా కార్యకలాపాలకు ఏర్పాట్లు చేస్తున్నాడని తేలింది. ఇద్దరు మహిళల బృందాన్ని బస్సులో హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్తుండగా సోమవారం పుణెలో అరెస్ట్‌ చేశారు. వారి నుంచి వివిధ రూపాల్లో ఉన్న 5.615 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని