సీబీఐ కస్టడీకి మనీశ్‌ సిసోదియా

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియాను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.

Updated : 28 Feb 2023 06:17 IST

అయిదు రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు
దేశవ్యాప్తంగా ఆప్‌ ఆందోళనలు

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియాను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది. మద్యం విధాన రూపకల్పన ప్రభుత్వ నిర్ణయమని, వ్యక్తిగతంగా కుట్ర చేసేందుకు అవకాశమే లేదని సిసోదియా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున సీబీఐ దాఖలు చేసిన రిమాండు అభ్యర్థనను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి తొలుత విచారణను వాయిదా వేశారు. అనంతరం మార్చి 4 వరకు సిసోదియాను కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతినిస్తూ సాయంత్రానికి నిర్ణయాన్ని వెలువరించారు. అంతకుముందు సిసోదియాను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ జరిగిన రౌస్‌ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కోర్టులో సుమారు గంటన్నరకు పైగా వాడీవేడి వాదనలు జరిగాయి. మద్యం విధానం సవరణకు ఆమోదముద్ర వేసింది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అని, కానీ సీబీఐ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెనక పడుతోందని సిసోదియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీని అనేక సంప్రదింపుల అనంతరం రూపొందించారని, ఎల్జీ నుంచి సైతం సలహాలు తీసుకునే నూతన విధానాన్ని తయారుచేశారని తెలిపారు. ఇందులో అవకతవకలకు అవకాశమే లేదని వాదించారు. బడ్జెట్‌ సమర్పించాల్సిన ఈ సమయంలో ఒక ఆర్థికమంత్రిని అరెస్టు చేయడం ఒక వ్యక్తిపై కాక వ్యవస్థపైన జరిగిన దాడిగా పేర్కొన్నారు. ముద్దాయి పలుమార్లు సెల్‌ఫోన్లు మార్చారని సీబీఐ ఆరోపిస్తోందని అదేం నేరం కాదు కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తాము దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోదియాను ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. మద్యం విధానం కోసం రూపొందించిన డ్రాఫ్ట్‌ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోదియా తొలగించారని ఆరోపించింది. ఆయన తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొంది.

సీబీఐకి అరెస్టు ఇష్టంలేదు: కేజ్రీవాల్‌

సీబీఐ అధికారుల్లో చాలా మందికి సిసోదియాను అరెస్టు చేయడం ఇష్టం లేదని,. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఆ పని చేయక తప్పలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. కల్పితాలను వాస్తవాలుగా ప్రచారం చేయడాన్ని కేజ్రీవాల్‌ మానుకోవాలని భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ ఆ ట్వీట్‌కు బదులిచ్చారు. అదానీపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండు చేసిన నాయకులను కావాలని ఈ నియంతృత్వ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా వినియోగిస్తోందని ఆరోపిస్తూ సీపీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ ప్రజలు భాజపాకు త్వరలోనే గుణపాఠం చెబుతారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్టుపై ఆప్‌ గరం గరం

సిసోదియా అరెస్టుకు నిరసనగా ఆప్‌ కార్యాలయం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లేందుకు  ఆప్‌ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆప్‌ కార్యాలయం బయటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనలు హెచ్చుమీరడంతో పారామిలటరీ దళాలను పెద్ద సంఖ్యలో మోహరించి, డ్రోన్‌ల సాయంతో పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఎంత హెచ్చరించినా ఆందోళన విరమించకపోవడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సుమారు 10 బస్సుల్లో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దిల్లీతో పాటు చండీగఢ్‌, భోపాల్‌, కోల్‌కతా, ముంబయి, శ్రీనగర్‌, జమ్మూ, పణజీ, పట్నా తదితర నగరాల్లో ఆప్‌ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. ఆప్‌ ఆందోళనలపై భాజపా దుమ్మెత్తిపోసింది. అవినీతికి వ్యతిరేకంగా సీబీఐ చట్టబద్ధంగా ముందుకు వెళ్తోందని, ఆప్‌ మాత్రం చట్టం, రాజ్యాంగం, ప్రజలను తన స్పృహలోంచి తీసేసినట్లు కనిపిస్తోందని భాజపా ఆరోపించింది. ఇద్దరు మంత్రులు ఇప్పటికే అవినీతి కేసుల్లో అరెస్టయినందున సీఎం కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేసింది.


సౌత్‌గ్రూప్‌తో కుమ్మక్కయ్యారు: రిమాండు రిపోర్టులో సీబీఐ

ఈనాడు, దిల్లీ: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా దక్షిణ భారత వ్యాపారుల (సౌత్‌గ్రూప్‌)తో కుమ్మక్కై ఎక్సైజ్‌ పాలసీని మార్చినట్లు సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఈ విధాన రూపకల్పన జరిగే సమయంలో ఆయన నాలుగు ఫోన్లు మార్చారని, అందులో మూడింటిని ధ్వంసం చేశారని తెలిపింది ‘‘ఈ పాలసీ కోసం రూపొందించిన ముసాయిదాలో తొలుత హోల్‌సేలర్స్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 5 శాతం, రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలని ప్రతిపాదించారు. అయితే తర్వాత మూడు రోజుల్లోనే హోల్‌సేలర్స్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ను 5 నుంచి 12 శాతానికి, టర్నోవర్‌ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతూ మార్పులు చేశారు. ఇందుకు కారణాలేంటన్నది సిసోదియా చెప్పలేకపోయారు’ అని రిపోర్టులో పేర్కొంది.

ముసాయిదాలో వాట్సప్‌ సంభాషణలు

హోల్‌సేలర్స్‌కు 12% ప్రాఫిట్‌ మార్జిన్‌ నిర్ణయించడానికి ఏ ప్రాతిపదికను అనుసరించారో చెప్పే డాక్యుమెంట్లు ఎక్సైజ్‌ శాఖలో కనిపించలేదని పైగా సిసోదియా, కొందరు సహ నిందితుల మధ్య జరిగిన వాట్సప్‌ సంభాషణలనే ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఖరారుచేసిన ముసాయిదాలో యథాతథంగా చేర్చారని సీబీఐ పేర్కొంది. ‘పాలసీని తమకు అనుగుణంగా రాసుకుని అనుచిత లబ్ధి పొందడానికి నిందితులంతా కుమ్మక్కయ్యారని ఈ ఉదంతం స్పష్టంగా చెబుతోంది. ఈకేసును సీబీఐకి ప్రతిపాదించిన 2022 జులై 22వ తేదీ నాడే సిసోదియా తన ఫోన్‌ మార్చారు. దాన్ని దర్యాప్తు సమయంలో సీబీఐకి అప్పగించలేదు. 2021 జనవరి 1 నుంచి ఆగస్టు 19 మధ్యకాలంలో నాలుగు మొబైళ్లు మార్చారు. అందులో మూడింటిని ధ్వంసం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ కింద మూడుసార్లు నోటీసులు ఇవ్వగా ఆయన గత ఏడాది అక్టోబర్‌ 17న, ఈ ఏడాది ఫిబ్రవరి 26న హాజరయ్యారు. తగినంత సమయం ఇచ్చినా విచారణలో సిసోదియా నిజాలను దాచిపెట్టారు. ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, అక్రమంగా హవాలా మార్గంలో సంపాదించిన డబ్బు గురించి చెప్పడంలేదు. తనకు వ్యక్తిగతంగా తెలిసిన విషయాలను చెప్పకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేశాం’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ వెల్లడించింది.


ప్రధాని, అదానీల బంధంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే
దిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టుపై సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని, అదానీల మధ్య అనుబంధంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిందని భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని