IMD: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే సూర్యుని ప్రకోపం

దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) వెల్లడించింది.

Updated : 01 Mar 2023 06:58 IST

ఈనాడు, దిల్లీ: దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఐఎమ్‌డీ అందించిన సమాచారం ప్రకారం.. దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ, సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. మధ్యభారతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి భాగంలో మార్చి నుంచి మే మధ్యకాలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటున 15.49 డిగ్రీలమేర నమోదుకాగా ఈ ఏడాది 16.82 డిగ్రీలుగా నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువ స్థాయిలో నమోదుకావడం అయిదోసారి. ఈ ఫిబ్రవరిలో వాయవ్య భారత్‌లో 24.86 డిగ్రీలు (సాధారణ సగటుకంటే 3.40 డిగ్రీలు అధికం), మధ్యభారత్‌లో 31.93 (2.05 డిగ్రీలు అధికం), తూర్పు, ఈశాన్య భారత్‌లో 13.99డిగ్రీల(1.67 డిగ్రీలు అధికం)మేర నమోదయ్యాయి. రాబోయే మార్చి నుంచి మే నెలల మధ్యకాలంలో దేశంలోని ఈశాన్యం, తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో, నైరుతి భాగంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని