Earthquake: ఉత్తర్‌కాశీలో వరుస ప్రకంపనలు.. 12 గంటల వ్యవధిలో మూడుసార్లు

ఉత్తర్‌కాశీలో (Uttarkashi) ఇటీవల వరుసగా సంభవిస్తున్న భూప్రకంపనలు కలవరపెడుతున్నాయి. తాజాగా 12 గంటల వ్యవధిలోనూ మూడుసార్లు భూమి కంపించినట్లు (Earthquake) అధికారులు వెల్లడించారు. 

Published : 06 Mar 2023 18:44 IST

ఉత్తర్‌కాశీ: జోషీమఠ్‌ ప్రాంతంలో భూమి చీలికల ఘటన మరవకముందే పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ ఇటీవల వరుసగా స్వల్ప స్థాయిలో భూమి కంపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా 12 గంటల వ్యవధిలోనే ఉత్తర్‌కాశీలో మూడుసార్లు భూమి కంపించడం  స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మూడుసార్లు ఈ ప్రకంపనలు వచ్చినట్లు ఉత్తరాఖండ్‌ విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సిరోర్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై 2.5 తీవ్రత నమోదైంది. తర్వాత మరోసారి కంపించింది. సోమవారం ఉదయం కూడా 1.8 తీవ్రతతో మూడోసారి భూమి కంపించినట్లు ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి రంజిత్‌ సిన్హా వెల్లడించారు. ఇలా 12 గంటల వ్యవధిలోనూ మూడుసార్లు భూకంపం వచ్చిందని.. భూకంప కేంద్రం ఉత్తర్‌కాశీలోని ఉత్తరం వైపు నమోదైందని చెప్పారు.

రెండు నెలల్లో 12సార్లు..

దేశంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతంలోనే ఉత్తర్‌కాశీ ఉంది. అత్యంత ముప్పు ఉన్న ‘జోన్‌ V’ పరిధిలోకే ఈ ప్రాంతం వస్తుంది. గడిచిన రెండు నెలల్లో 12 సార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ వరుస ప్రకంపనలు.. భారీ భూకంపానికి సూచిక అనే భయాలు కూడా అక్కడివారిలో నెలకొన్నాయి. మరోవైపు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనే సోమవారం ఉదయం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ వెల్లడించింది.

ఇదిలాఉంటే, ఇటీవల తుర్కియేలో చోటుచేసుకున్న భూ ప్రళయం వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. తుర్కియే, సిరియాల్లో కలిపి 53వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, ఆ భయం అక్కడివారినే కాకుండా భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలను వెంటాడుతూనే ఉంది. భూకంప ముప్పు ప్రాంతాల్లో చిన్న ప్రకంపనలు వచ్చినా అక్కడివారు కలవరపాటుకు గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని