రబ్రీదేవిని ప్రశ్నించిన సీబీఐ

రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్నప్పుడు 2004-09 మధ్య కాలంలో రైల్వేలో పలువురికి గ్రూపు-డి ఉద్యోగాలిచ్చి, దానికి బదులుగా విలువైన స్థలాలను తీసుకునేవారన్న ఆరోపణలపై ఆయన భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు.

Published : 07 Mar 2023 04:35 IST

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో విచారణ
లాలూ ప్రసాద్‌కు సమన్లు జారీ

దిల్లీ/పట్నా: రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్నప్పుడు 2004-09 మధ్య కాలంలో రైల్వేలో పలువురికి గ్రూపు-డి ఉద్యోగాలిచ్చి, దానికి బదులుగా విలువైన స్థలాలను తీసుకునేవారన్న ఆరోపణలపై ఆయన భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. పట్నాలోని నివాసంలో ఆమెను ప్రశ్నించిన అనంతరం ఈ కుంభకోణానికి సంబంధించి లాలూకు కూడా సమన్లు జారీ చేశారు. ఎలాంటి సోదాలు, దాడులు జరపలేదనీ, రబ్రీదేవి సోమవారం అందుబాటులో ఉంటానని చెప్పడంతో నివాసానికి వెళ్లి ప్రశ్నించామని సీబీఐ తెలిపింది. లాలూకు ఇదే తరహా నోటీసులు ఇచ్చినట్లు చెప్పినా, ఏరోజు ప్రశ్నిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.

నేడు లాలూ విచారణ

సీబీఐ వర్గాలు లాలూను మంగళవారం విచారించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ ఇటీవలే అక్కడి నుంచి తిరిగి వచ్చారు. దిల్లీలో కుమార్తె మీసాభారతి నివాసంలో ఆయన్ని అధికారులు విచారిస్తారు. స్థలాల బదలాయింపునకు సంబంధించి మరికొన్ని పత్రాలను నిందితుల నుంచి రాబట్టడంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. సీబీఐ తన పని తాను చేస్తోందని, ‘నాటిన పంట దిగుబడి’నే లాలూ ఇప్పుడు పొందుతున్నారని భాజపా పేర్కొంది.

కేసు ఇదీ..

లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో పట్నా కేంద్రంగా ఉన్న రైల్వేజోన్‌కు చెందిన కొందరికి ముంబయి, కోల్‌కతా, జబల్‌పుర్‌, జైపుర్‌ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని, దానికి బదులుగా అభ్యర్థులు తమ స్థలాలను లాలూ ప్రసాద్‌కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి కారుచౌక ధరకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. పట్నాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.4.39 కోట్ల విలువ చేసే 1,05,292 చదరపు అడుగుల స్థలాన్ని ఐదు క్రయ ఒప్పందాలు, రెండు బహుమతి ఒప్పందాల ద్వారా లాలూ కుటుంబం సంపాదించిందని ఆ సంస్థ పేర్కొంది. గత ఏడాది అక్టోబరు 7న లాలూ, రబ్రీదేవిలపై, మరో 14 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మరిన్ని వివరాలు రాబట్టడానికి సీబీఐ వర్గాలు రబ్రీదేవి నివాసానికి వెళ్లాయి.

భాజపా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలు చర్యల్ని చేపట్టడం బహిరంగ రహస్యమేనని లాలూప్రసాద్‌ విలేకరులతో వ్యాఖ్యానించారు. తలవంచకపోవడం వల్లనే లాలూ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్లో ఆరోపించారు. సీబీఐ రాక గురించి తెలుసుకున్న ఆర్జేడీ కార్యకర్తలు రబ్రీదేవి నివాసం వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడికి సమీపంలో నివసించే బిహార్‌ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ వెంటనే సైకిల్‌ తొక్కుకుంటూ తల్లి నివాసానికి చేరుకున్నారు. భాజపాను, కేంద్రాన్ని తాము వ్యతిరేకిస్తున్నందువల్లనే సీబీఐ వర్గాలు తన తల్లి నివాసానికి వచ్చాయని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు.


విపక్షాల ఆగ్రహం

రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి పలువురు విపక్ష నేతలు లేఖ రాసిన మరుసటి రోజే సీబీఐ రంగంలో దిగడం రాజకీయంగా విమర్శలకు తెరతీసింది. కేంద్రం తీరుపై ఆర్జేడీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి రాసిన లేఖపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా సంతకం చేశారని, అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. సీబీఐ అధికారుల చర్య రబ్రీదేవిని అవమానించడమేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. తేజస్వీ యాదవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే కేంద్రం సీబీఐ దాడులు చేయిస్తోందని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని