Garbh Sanskar: గర్భంలో ఉన్నప్పటి నుంచే సంస్కార పాఠాలు

గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువులకు సంస్కారాన్ని అలవరిచేలా గర్భిణులకు ‘గర్భ సంస్కార్‌’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్‌’ ప్రారంభించింది.

Updated : 07 Mar 2023 09:43 IST

కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ

దిల్లీ: గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువులకు సంస్కారాన్ని అలవరిచేలా గర్భిణులకు ‘గర్భ సంస్కార్‌’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్‌’ ప్రారంభించింది. దీనివల్ల శిశువులకు విలువలు, సంస్కృతిపై అవగాహన ఏర్పడుతుందని ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మాధురి మరాతే తెలిపారు. గర్భిణులుగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించి పిల్లలు పుట్టి వారికి రెండేళ్లు వచ్చే వరకూ ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. గైనకాలజిస్టులు, ఆయుర్వేదిక్‌ వైద్యులు, యోగా శిక్షకులతో కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నామని, అందులో గర్భిణులకు గీతా పారాయణం, రామాయణ పాఠాలు, యోగా శిక్షణ ఉంటాయని వివరించారు. గర్భంలో ఉన్న శిశువు 500 పదాలను నేర్చుకునే అవకాశముందని, 1000 మంది గర్భిణులను తొలుత ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.

గర్భ సంస్కార్‌ అనేది అద్భుతమైన ఆలోచనని, మహా భారతంలో అభిమన్యుడి కథ ఆధారంగా దీనిని రూపొందించారని పుణెకు చెందిన గైనకాలజిస్టు పంకజ్‌ సరొదే తెలిపారు. అయితే సైన్సు సహాయమూ అవసరమేనని, మంచి ఆహారం, మంచి ఆలోచనలు తోడైతే మరిన్ని మంచి ఫలితాలొస్తాయని వెల్లడించారు. గర్భ సంస్కార్‌ అనేది శిశువుల అభివృద్ధికి తోడ్పడే టెక్నిక్‌ అని, తల్లి మానసిక పరిస్థితి కూడా శిశువుల పెరుగుదలకు ఎంతో ముఖ్యమని గురుగ్రామ్‌కు చెందిన వైద్యురాలు రీతు సేథీ తెలిపారు. ‘సమతుల ఆహారం తీసుకోవడం, మంచి సంగీతం వినడం, ఒత్తిడి లేని వాతావరణం, మంచి ఆలోచనలు, యోగా, మెడిటేషన్‌, వ్యాయామం శిశువులపై ప్రభావం చూపుతాయని వివరించారు.


మతం మారిన దళితులకు రిజర్వేషన్లు తీసేయాలి
ఆరెస్సెస్‌ సంస్థల సదస్సులో తీర్మానం

దిల్లీ: ఇస్లాం, క్రైస్తవం తదితర మతాల్లోకి మారిన దళితులకు రిజర్వేషన్ల ప్రయోజనాలు తీసేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌) మీడియా విభాగం నిర్వహించిన సదస్సు తీర్మానం చేసింది. ఈ విషయాన్ని సోమవారం విశ్వహిందూ పరిషత్‌ కార్యనిర్వాహాక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మతమార్పిడికి పాల్పడిన వ్యక్తులకు షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లు వర్తింప చేయాలా.. వద్దా అన్న అంశంపై కేంద్రం నియమించిన కె.జి.బాలకృష్ణన్‌ కమిషన్‌కు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలను కమిషన్‌ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఇస్లాం, క్రైస్తవంలోకి చేరిన దళితులకు రిజర్వేషన్లు కల్పించే ఎలాంటి ప్రతిపాదననైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ విభాగంలో ముస్లింలు, క్రైస్తవులు ఇప్పటికే రిజర్వేషన్ల ప్రయోజనాలను అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ‘‘మైనారిటీలు రిజర్వేషన్లే కాదు.. ఉచిత రేషన్‌, హౌసింగ్‌, మరుగుదొడ్లు, విద్యుత్తు తదితర సంక్షేమ పథకాలను కూడా పొందుతున్నారు. అందువలన షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లు పవిత్రం.. వాటిని ముట్టుకోకూడదు’’ అని అలోక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని