Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసులో అరుణ్ పిళ్లై అరెస్టు
దిల్లీ మద్యం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై.. భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది.
ఎమ్మెల్సీ కవితకు ఆయన బినామీ: ఈడీ
ఈ వ్యవహారంలో అక్రమార్జన రూ. 296 కోట్లని ఆరోపణ
ఆయన విచారణకు సహకరించడం లేదన్న అధికారులు
రిమాండ్ నివేదికలో పలు అభియోగాలు
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై.. భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లు ఉండవచ్చని ఆరోపించింది. ఇందులో కొంత మొత్తాన్ని అరుణ్‌పిళ్లై స్థిర, చరాస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్లైను సోమవారం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో చాలాసేపు విచారించిన అధికారులు రాత్రివేళ ఆయనను అరెస్టు చేశారు. మంగళవారం దిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయనను హాజరుపరిచిన సందర్భంగా ఈడీ అధికారులు రిమాండ్ నివేదికలో పలు అభియోగాలు చేశారు. ‘భారీ ముడుపులు, సౌత్‌గ్రూప్‌తో కలిపి పెద్ద సిండికేట్‌తో కూడిన దిల్లీ మద్యం కేసులో అరుణ్ పిళ్లై కీలక వ్యక్తి. సౌత్‌గ్రూప్‌లో భాగస్వాములుగా శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ్, ఎమ్మెల్సీ కె.కవిత, ఇతరులు ఉన్నారు. బయట దానికి ప్రతినిధులుగా అరుణ్పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారు’ అని తెలిపింది. నివేదికలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి.
అరుణ్‌దే కీలక భూమిక
‘సౌత్‌గ్రూప్, ఆప్ నేతల మధ్య రాజకీయ ఒప్పందం కుదర్చడానికి అరుణ్, అతని అనుచరులు వివిధ వ్యక్తులతో కలిసి వ్యవహారం నడిపారు. ఆప్ నేతలకు ముడుపులు ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని మద్యం వ్యాపారం ద్వారా తిరిగి రాబట్టుకోవడంలో ఈయన కీలకం. ఎల్1 లైసెన్స్ పొందిన ఇండోస్పిరిట్స్ సంస్థలో అరుణ్ పిళ్లైకి 32.5%, ప్రేమ్ రాహుల్‌కు 32.5%, ఇండోస్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌కు 35% వాటా ఉంది. ఇందులో కె.కవిత బినామీ పెట్టుబడులకు అరుణ్ పిళ్లై.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట బినామీ పెట్టుబడులకు ప్రేమ్‌రాహుల్ ప్రతినిధులుగా ఉన్నారు. అరుణ్, తన సహచరులు అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చిబాబులతో కలిసి సౌత్‌గ్రూప్ తరఫున వ్యవహారాలు నడిపి.. తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు అంతా కుమ్మక్కయ్యేలా చేసి దిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఇండోస్పిరిట్స్ సంస్థలో తాము కవిత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అరుణ్‌పిళ్లైతోపాటు, మరోవ్యక్తి తమ వాంగ్మూలాల్లో అంగీకరించారు. కాగితాల్లో పేర్కొన్న లెక్కల ప్రకారం అరుణ్ పిళ్లై ఇండోస్పిరిట్స్‌లో రూ.3.40 కోట్లు పెట్టుబడి పెట్టారు. అందులో రూ.కోటి కవిత సూచనల మేరకు అతనికి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీలో 9 రిటైల్ జోన్లను నియంత్రణలో ఉంచుకున్న మాగుంట అగ్రోఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైడెంట్ క్యాంఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఖావో గాలీ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు సిండికేట్‌గా ఏర్పడటంలో అరుణ్ పిళ్లై కీలకభూమిక పోషించారు. ఆప్ నేతలకు ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులను మద్యం వ్యాపారం ద్వారా తిరిగి రాబట్టుకొనేందుకు ఈ సిండికేట్ ఏర్పాటైంది. ఇందుకోసం ఆప్ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, మరికొందరు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సూట్ రూంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అభిషేక్ బోయిన్‌పల్లి, దినేష్ అరోడాలకు విజయ్‌నాయర్ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.31 కోట్ల ముడుపులను హైదరాబాద్ నుంచి దిల్లీకి బదిలీ చేశారు.
12 శాతం లాభం.. 6 శాతం ముడుపులు
హోల్‌సేల్ లైసెన్సు దక్కించుకున్న సంస్థలకు 12% లాభం వచ్చేలా మద్యం విధానం రూపొందించారు. ఇందులో 6% ఆప్ నేతలకు ముడుపులుగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దిల్లీలో ఏటా సగటున రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా వ్యాపారం జరుగుతుంది. అందులో రూ.3,500 కోట్ల వ్యాపారం 3 హోల్‌సేల్ సంస్థల (ఇండోస్పిరిట్స్, బ్రిండ్కో, మహదేవ్ లిక్కర్స్) చేతుల్లో ఉంది. వీటికి 12% లాభం కింద రూ.420 కోట్లు దక్కితే అందులో రూ.210 కోట్లు ఆప్ నేతలకు ముడుపుల కింద వెళ్లాల్సి ఉంది. ఎల్1 లైసెన్స్ పొందిన అందరూ 6% మొత్తాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అత్యధిక మొత్తంలో వ్యాపారం చేస్తున్న 3 సంస్థలపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. వాస్తవానికి వ్యాపారం చేసిన తర్వాతే ఈ ముడుపులు ముట్టజెప్పాల్సి ఉన్నప్పటికీ ఆప్‌నకు నిధులు అత్యవసరం కావడంతో ఆ పార్టీ తరఫున విజయ్‌నాయర్ రంగంలోకి దిగి.. అరుణ్‌పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చిబాబులతో కలిసి రూ. 100 కోట్ల ముడుపులు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ మొత్తాన్ని సౌత్‌గ్రూప్ విజయ్‌నాయర్‌కు ముందస్తుగా చెల్లించింది. వారు ఈ రూ.100 కోట్లను పైన పేర్కొన్న మూడు హోల్‌సేల్ వ్యాపార సంస్థల నుంచి తిరిగి రాబట్టుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు.
* 2022 సెప్టెంబరు 23న దిల్లీ ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన లేఖ ప్రకారం మద్యం విధానం నడిచిన కాలంలో ఇండోస్పిరిట్స్ సంస్థకు 12% లాభం కింద రూ.192.8 కోట్లు దక్కింది. ఇది నేరపూరిత ఆర్జనే. ఈ మొత్తంలో అరుణ్‌పిళ్లై రూ.32.8 కోట్లు తీసుకున్నారు. ఇండోస్పిరిట్స్ సంస్థ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ప్రకారం రూ.25.5 కోట్లు నేరుగా అరుణ్‌పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. అరుణ్, అతని భార్య పేరు మీదున్న రూ.5.72 కోట్ల ఆస్తులను జనవరి 24న అటాచ్ చేశాం. మొత్తంగా ఈ వ్యవహారంలో కనీసం రూ. 296 కోట్ల మేర అక్రమార్జన జరిగింది. విచారణ సమయంలో అరుణ్‌పిళ్లై నిజాలు చెప్పకుండా తప్పించుకొనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వాస్తవాలను వెలికితీయడానికి అతడిని కస్టడీకి అప్పగించాలి’ అని ఈడీ పేర్కొంది.
వారం రోజుల కస్టడీకి పిళ్లై
- కెమెరా ఎదుట విచారించాలని కోర్టు ఆదేశం
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా.. జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఆయనను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది. దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని, నగదు లావాదేవీల వ్యవహారాన్ని తేల్చేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాదులు కోర్టులో వాదనల సందర్భంగా కోరారు. నిందితుడు సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లై మధ్య నగదు లావాదేవీలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మరో నిందితుడు బుచ్చిబాబు తమకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ పలు కీలకాంశాలు బహిర్గతమయ్యాయని, బుచ్చిబాబు వాట్సాప్ చాట్‌తో నగదు అక్రమ లావాదేవీల్లో పిళ్లై పాత్ర స్పష్టమైందని తెలిపారు. ఈ వ్యవహారంలో పిళ్లై, బుచ్చిబాబులను కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రత్యేక జడ్జి.. ఆధారాలున్న తర్వాత అరెస్టును ఎందుకు ఆలస్యం చేశారని, పదే పదే ఎందుకు విచారించారని ప్రశ్నించారు. సేకరించిన ఆధారాలతో పిళ్లైని అరెస్టు చేశామని, మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాదులు కోరారు. అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఇప్పటివరకు 29 సార్లు ఈడీ, 10 సార్లు సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. అయినా విచారణకు సహకరించలేదనడం సరైంది కాదన్నారు. పిళ్లై తల్లి ఆరోగ్యం బాగా లేదని, ఆయన కూడా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి నాగ్‌పాల్.. అరుణ్ పిళ్లైను కస్టడీకి ఇచ్చారు. పిళ్లై తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేందుకు, రోజూ భార్య, బావమరిది ఆయనను కలిసేందుకు, వెన్ను నొప్పికి బెల్ట్, అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులు ఇచ్చేందుకు జడ్జి అనుమతించారు. పిళ్లైను కెమెరా ఎదుట విచారించాలని ఈడీని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. పిచ్‌పై తగ్గిన పచ్చిక.. వైరల్‌గా మారిన దినేశ్ కార్తిక్ ఫొటోలు!
-
Sports News
wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రెండు పిచ్‌లు సిద్ధం.. ఎందుకంటే..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!
-
Crime News
Sattenapalle: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అనుమానంతో..
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్