మరోసారి ఇస్రో సత్తా

భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 (ఎంటీ 1)ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో మంగళవారం ప్రకటించింది.

Updated : 08 Mar 2023 06:30 IST

విజయవంతంగా ఉపగ్రహం ధ్వంసం
ఆ సామర్థ్యం ఉన్న అమెరికా,రష్యా, చైనా దేశాల సరసన భారత్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 (ఎంటీ 1)ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో మంగళవారం ప్రకటించింది. సుమారు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 7.30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్‌ మహాసముద్రం పైన గగనతలంలో కాలి బూడిదైంది. యునైటెడ్‌ నేషన్స్‌ స్పేస్‌ డెబ్రిస్‌ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్‌కే ఉందని తెలిపారు. భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011 అక్టోబరు 12న ఫ్రెంచ్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపగా 2021 తర్వాత దీని పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. చైనా ఉపగ్రహాలు తరచూ భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో భారత ఉపగ్రహాల వల్ల అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలని ఇస్రో లక్ష్యం పెట్టుకుంది. గంటకు 27 వేల కి.మీ. వేగంతో కక్ష్యలో తిరుగుతున్న మేఘాను ధ్వంసం చేయడం ద్వారా గతితప్పిన, కాలం చెల్లిన ఉపగ్రహాలను కూల్చేసే సత్తా ఇస్రోకు ఉన్నట్లు స్పష్టమయింది.


గగన్‌యాన్‌ కోసం పారాచూట్ పరీక్షలు

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా పారాచూట్ పరీక్షలను చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ ల్యాబరేటరీ పరిధిలో ఈ నెల 1, 3వ తేదీలలో నిర్వహించామని ఇస్రో మంగళవారం ప్రకటించింది. వాహకనౌకలో వ్యోమగాములను పంపించి, వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి జరుపుతున్న ప్రయోగాల్లో భాగంగా రెండు పైలట్ పారాచూట్లను పరీక్షించారు. ఒకటి గాలి ప్రవాహానికి అనుగుణంగా తక్కువ కోణంలో, మరొకటి ఎక్కువ కోణంతో కిందకు దిగేందుకు అనువుగా చర్యలు తీసుకున్నామని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. గాలి ఒత్తిడి, వేగం, ప్రతికూల పరిస్థితులను ఈ పారాచూట్లతో అధిగమించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను అధ్యయనం చేసేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ ప్యారాచూట్ వ్యవస్థను తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్‌ సెంటర్‌, ఆగ్రాలోని ఏరియల్‌ డెలివరీ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సహకారంతో అభివృద్ధి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు