Rajyasabha: ధన్‌ఖఢ్ అనూహ్య నిర్ణయం..రాజ్యసభ కమిటీల్లోకి ఛైర్మన్ వ్యక్తిగత సిబ్బంది

రాజ్యసభ కమిటీలకు అనుబంధంగా తన వ్యక్తిగత సిబ్బందిని నియమించడం ద్వారా ఉపరాష్ట్రపతి, సభ ఛైర్మన్‌ అయిన జగదీప్‌ ధన్‌ఖఢ్‌ కొత్త సంప్రదాయానికి తెరలేపారు.

Updated : 09 Mar 2023 10:25 IST

నిఘా కోసమేనంటూ కాంగ్రెస్‌ మండిపాటు

దిల్లీ: రాజ్యసభ కమిటీలకు అనుబంధంగా తన వ్యక్తిగత సిబ్బందిని నియమించడం ద్వారా ఉపరాష్ట్రపతి, సభ ఛైర్మన్‌ అయిన జగదీప్‌ ధన్‌ఖఢ్‌ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. 20 రాజ్యసభ కమిటీలకు అనుబంధంగా 8 మంది తన సిబ్బందిని ఆయన నియమించారు. రాజ్యసభ సచివాలయం మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలోని నలుగురితోసహా 8 మంది ఈ 20 కమిటీల్లో కొనసాగుతారు. నాలుగు పార్లమెంటరీ కమిటీలు, మరో నాలుగు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో ఈ నియామకాలు జరిగాయి. ఇలా నియమితులైన వారిలో ఉపరాష్ట్రపతి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ), వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఛైర్మన్‌ ఓఎస్‌డీ ఉన్నారు. ఈ కమిటీల్లో ఎక్కువగా ప్రతిపక్ష నేతలు నేతృత్వం వహించేవే ఉన్నాయి. వాస్తవానికి రాజ్యసభ సెక్రటేరియట్‌ సిబ్బంది ఈ కమిటీలకు సహాయకులుగా ఉంటారు. ఈ విధానాన్ని తోసిరాజని ఉపరాష్ట్రపతి కొత్తగా తన సిబ్బందిని ఈ కమిటీల్లోకి చొప్పించారు. వీరంతా జూనియర్‌ స్థాయి అధికారులే. కమిటీలపై నిఘా కోసమే ఉపరాష్ట్రపతి ఈ నియామకాలు జరిపారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఇవి సంప్రదాయాలకు విరుద్ధంగా జరిపిన నియామకాలని విమర్శించారు. దీనివల్ల రహస్యంగా ఉండాల్సిన కమిటీల కార్యకలాపాలు బహిరంగమవుతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని