Dayalpur: టికెట్లు కొంటారు.. కానీ రైలు ఎక్కరు!.. దయాల్‌పుర్‌ స్టేషన్‌లో వింత దృశ్యం

టికెట్‌ లేకుండా రైలు ప్రయాణం చేసేవారు కొత్తేం కాదు. కానీ రైలు ఎక్కకపోయినా టికెట్‌ కొనేవాళ్లు ఉన్నారంటే నమ్మగలరా..? నమ్మకపోతే దయాల్‌పుర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిందే.

Updated : 09 Mar 2023 15:28 IST

టికెట్‌ లేకుండా రైలు ప్రయాణం చేసేవారు కొత్తేం కాదు. కానీ రైలు ఎక్కకపోయినా టికెట్‌ కొనేవాళ్లు ఉన్నారంటే నమ్మగలరా..? నమ్మకపోతే దయాల్‌పుర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌ను 1954లో నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్‌కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో 2006లో దీన్ని మూసేశారు.

తమ గ్రామంలో రైల్వే స్టేషన్‌ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్‌పుర్‌ ప్రజలు కొన్నేళ్లపాటు పోరాటం చేశారు. వారి కృషి ఫలించి 2022 జనవరిలో అధికారులు స్టేషన్‌ను తిరిగి ప్రారంభించారు. కొన్నాళ్లపాటు టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మళ్లీ అమ్మకాలు పడిపోయాయి. ఇన్నేళ్లు కష్టపడి.. తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్‌ మళ్లీ మూతపడితే ఎలా అన్న సందేహం గ్రామస్థుల్లో మొదలైంది. ఆదాయం తగ్గి స్టేషన్‌ మూతపడకుండా ఉండేందుకు గ్రామస్థులు ప్రయాణాలు చేయకపోయినా టికెట్లు కొంటున్నారు.

అలా.. 2022 డిసెంబర్‌ వరకు నెలకు సుమారు 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీన్ని గమనించిన గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారు. స్టేషన్‌ ఆదాయం తగ్గిపోయినప్పుడల్లా తాము టికెట్లు కొంటామని గ్రామస్థులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని