ఆ ఊరిలో మార్ఫింగ్‌ ఫొటోలతో మహిళా జడ్జికి బెదిరింపులు.. రూ.20లక్షలు ఇవ్వాలని హెచ్చరిక

రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఓ వ్యక్తి ఓ మహిళా న్యాయమూర్తి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగాడు.

Published : 10 Mar 2023 04:14 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఓ వ్యక్తి ఓ మహిళా న్యాయమూర్తి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగాడు. తనకు రూ.20లక్షలు ఇవ్వాలని.. లేదంటే వాటిని బహిర్గతం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జడ్జి ఫొటోలను నిందితుడు సామాజిక మాధ్యమాల్లోని ఆమె ఖాతా నుంచి డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేశాడు. కోర్టులోని న్యాయమూర్తి ఛాంబర్‌తోపాటు ఆమె ఇంటికీ వాటిని పంపించాడు. గత నెల 7న స్టెనోగ్రాఫర్‌ ద్వారా పార్సిల్‌ అందుకున్న జడ్జి.. అందులో ఉన్న వాటిని చూసి దిగ్భ్రాంతి చెందారు. అందులో కొన్ని స్వీట్లు, అసభ్యకరమైన ఫొటోలతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. రూ.20లక్షలతో సిద్ధంగా ఉండాలని.. లేదంటే ఫొటోలను బహిర్గతం చేసి జీవితాన్ని నాశనం చేస్తానంటూ నిందితుడు హెచ్చరించాడు. నగదు ఎప్పుడు, ఎక్కడకు పంపించాలో త్వరలోనే తెలియజేస్తానని పేర్కొన్నాడు. జడ్జి పిల్లల పాఠశాల నుంచి ఈ పార్సిల్‌ను తీసుకొచ్చినట్లు స్టెనోగ్రాఫర్‌కు చెప్పిన నిందితుడు.. పేరు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో 20 రోజుల తర్వాత అలాంటి పార్సిల్‌ మరొకటి జడ్జి ఇంటికి పంపించాడు. దీంతో మహిళా న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిబ్రవరి 28న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ దృశ్యాల సాయంతో నిందితుడిని గుర్తించారు. అతణ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని