లోక్‌సభలో పూర్తి భావప్రకటనా స్వేచ్ఛ

లోక్‌సభలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, సభ్యులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి దాన్ని ఉపయోగించుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లా పిలుపునిచ్చారు.

Published : 13 Mar 2023 03:46 IST

సభ్యులంతా దాన్ని ఉపయోగించుకోవాలి: ఓం బిర్లా

ఈనాడు, దిల్లీ: లోక్‌సభలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, సభ్యులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి దాన్ని ఉపయోగించుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లా పిలుపునిచ్చారు. బహ్రెయిన్‌లోని మనామాలో జరుగుతున్న 146వ ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సదస్సులో ‘శాంతియుత సహజీవనం... సమ్మిళిత సమాజాలు... అసహనానికి వ్యతిరేకంగా పోరాటం’ అన్న అంశంపై ఆదివారం ఆయన మాట్లాడారు. ‘‘భారత్‌ పార్లమెంటులో మాట్లాడేందుకు సభ్యులకు పూర్తి స్వేచ్ఛాయుతమైన హక్కులున్నాయి. మా వద్ద భాగస్వామ్య ప్రజాస్వామ్యం, గతిశీలమైన బహుళపార్టీ విధానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలను ప్రజాప్రతినిధుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారతదేశ విధానం. భారత పార్లమెంటు.. వాతావరణ మార్పులు, లింగసమానత్వం, సుస్థిర అభివృద్ధి, కొవిడ్‌ మహమ్మారి లాంటి ప్రపంచసవాళ్లపై నిరంతరం విస్తృతస్థాయిలో అర్థవంతమైన చర్చలు జరుపుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు రావాల్సి ఉంది. అత్యంత ముఖ్యమైన ఈ అంశంపై గంభీరమైన చర్చలు జరగాలి. కొవిడ్‌ నిర్మూలనకు భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు దాన్ని ఎదుర్కొనేందుకు ఇతర దేశాలకూ మందులు, వ్యాక్సిన్లు, సామగ్రిని అందించింది. వాతావరణ మార్పుల ద్వారా వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రపంచ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. శాంతియుత సహజీవనం, పరస్పర చర్చల ద్వారానే సమ్మిళిత, సహనంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ విషయంలో పార్లమెంటులు కీలకపాత్ర పోషించాలి. మానవ ప్రపంచానికి ఉత్తమ భవిష్యత్తు నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజం కలసిరావాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని