రోజుకు 3 సెషన్లలో సీయూఈటీ.. యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌కుమార్‌

విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)- యూజీని ఈ ఏడాది రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఛైర్మన్‌ ఆచార్య మామిడాల జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

Updated : 16 Mar 2023 08:25 IST

దిల్లీ: విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)- యూజీని ఈ ఏడాది రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఛైర్మన్‌ ఆచార్య మామిడాల జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణలో గతేడాది జరిగిన తప్పిదాలను పునరావృతం కానీయమని పేర్కొన్నారు. జేఈఈ, నీట్‌ లాంటి పరీక్షలతో కలిసి సీయూఈటీని నిర్వహించే ప్రణాళికైతే ఉందని, అది వాస్తవరూపం దాలిస్తే.. ఆ విషయాన్ని విద్యార్థులకు రెండు సంవత్సరాల ముందుగానే తెలియజేస్తామని చెప్పారు. ‘‘ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ఏడాది సీయూఈటీని నిర్వహిస్తాం. సమస్యలను ముందుగానే గుర్తించాం. అందుకు తగ్గ చర్యలూ తీసుకుంటున్నాం’’ అని అన్నారు. ఇంజినీరింగ్‌, వైద్య ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌తో కలిసి సీయూఈటీని నిర్వహించే ప్రతిపాదనపైనా కుమార్‌ మాట్లాడారు. ‘‘అలా నిర్వహిస్తే 2 సంవత్సరాల ముందుగానే విద్యార్థులకు సమాచారమందిస్తాం. ప్రస్తుతమైతే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షపై అంతర్గతంగా చర్చిస్తున్నాం. ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని లోతుగా ఆలోచిస్తున్నాం. సీయూఈటీ పరీక్ష ఆఖరి తేదీ ఈ నెల 30. ఈ ఏడాది షెడ్యూల్‌ను 10 రోజులకు కుదించాం. గతేడాది జరిగిన తప్పిదాలను నివారించడానికే ఈ చర్య తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని