జడ్జీల నియామక ప్రతిపాదనలపై.. అసాధారణ పరిస్థితుల్లోనే ‘రా’ నివేదిక

సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి.

Published : 18 Mar 2023 05:20 IST

లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి : కిరణ్‌ రిజిజు

దిల్లీ: సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ప్రామాణిక విధానాల ప్రకారం హైకోర్టు కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలిపేముందు అవసరమైన, అందుబాటులో ఉన్న నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకొంటుందన్నారు. దిల్లీ హైకోర్టు జడ్జిగా ఓ న్యాయవాదికి పదోన్నతి కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ‘రా’ నివేదికను బహిర్గతం చేయడంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఆ నివేదికలో అభ్యర్థి లైంగిక ఆసక్తుల (సెక్సువాలిటీ) గురించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఓ విదేశీయుడు ఆ అభ్యర్థి జీవిత భాగస్వామిగా ఉన్నందున పునఃపరిశీలన నిమిత్తం ఆ పేరును కొలీజియంకు వెనక్కు పంపినట్లు వివరించారు. మద్రాసు హైకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి దాఖలైన రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తూ ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. న్యాయమూర్తులుగా తగిన వ్యక్తుల నియామకానికి వారి రాజకీయ నేపథ్యం అడ్డు కాబోదని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇదేవిధంగా పదోన్నతి కోసం సిఫార్సు చేసిన వ్యక్తుల విధానాలు, చర్యలను విమర్శించడమంటే వారిని అనర్హులుగా పేర్కొనడం కాదన్నారు.  

ఏకకాల ఎన్నికలపై సిఫార్సుల పరిశీలన

దేశంలో లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటూ పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మరోమారు ఈ వాదన వినిపించింది. అలా జరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుందని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసేలా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏకకాల ఎన్నికల ఆవశ్యకతలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఏకకాల ఎన్నికల అంశాన్ని పలు కోణాల్లో   పార్లమెంటరీ ప్యానెల్‌ అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈసీ కూడా భాగస్వామిగా ఉన్న ఈ కమిటీ ఏకకాల ఎన్నికలపై కొన్ని సిఫార్సులను చేసిందన్నారు. లా కమిషన్‌ పరిశీలన ముగిశాక.. ఈ ప్రక్రియపై ఆచారణ సాధ్యమైన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి రాజ్యాంగంలో కనీసం అయిదు ఆర్టికల్స్‌ సవరించాల్సి ఉంటుందన్నారు.

ఎరువులపై రాయితీ తగ్గించే యోచన లేదు

దేశంలో ఎరువులపై ఇస్తున్న రాయితీలను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు స్పష్టం చేసింది. రసాయన, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్‌ ఖుబా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రైతులకు ఇస్తున్న ఎరువుల రాయితీలు తగ్గిస్తే పడే ప్రభావం గురించి ఇప్పటిదాకా ఎటువంటి అధ్యయనం చేపట్టలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని