మరోసారి కొలీజియం రగడ
దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
జడ్జీల నియామకం బాధ్యత ప్రభుత్వానిదే
పరిపాలనాంశాల్లో జడ్జీలు నిమగ్నమైతే తీర్పులెవరిస్తారు?: కిరణ్ రిజిజు
కొలీజియం వ్యవస్థే ఉత్తమం.. న్యాయ వ్యవస్థ స్వతంత్రతే ముఖ్యం: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
దిల్లీ: దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పరిపాలనాపరమైన నియామకాల్లో జడ్జీలు తలమునకలైతే న్యాయ విధులుు ఎవరు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. శనివారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ప్రధాని, విపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాలను రాజ్యాంగం నిర్దేశించింది. దీనికి చట్టం లేనిమాట నిజమే. ఇందుకు పార్లమెంటు చట్టాన్ని రూపొందించాల్సి ఉంది. అయితే, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఇలా ప్రతి ముఖ్యమైన నియామకంపై తమ సమయాన్ని వెచ్చించాల్సి వస్తే...తీర్పులు ఎవరిస్తారు? దేశంలో పరిపాలనాపరమైన విషయాలు చాలా ఉంటాయి. ప్రజల వివాదాలు పరిష్కరించి న్యాయం చేయడం జడ్జీల ప్రధాన విధి’ అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదంటూనే రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్టులు విపక్ష పాత్ర వహించాలా?
దేశ వ్యతిరేక ముఠాలో భాగస్వాములైన కొందరు సామాజిక ఉద్యమకారులు, కొద్ది మంది మాజీ న్యాయమూర్తులు కోర్టులు విపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటూ అందుకు ప్రయత్నిస్తున్నారని కిరణ్ రిజిజు విమర్శించారు. అయితే భారతదేశంలో న్యాయవ్యవస్థ తటస్థంగానే ఉంటుందన్నారు. కొలీజియం వ్యవస్థనూ కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ఉనికిలోకి తెచ్చింది. అయితే, కొందరు దీనిని న్యాయవ్యవస్థ మితిమీరిన చర్యగా అభివర్ణించార’ని మంత్రి గుర్తు చేశారు. కొత్త విధానం అందుబాటులోకి వచ్చే వరకూ కొలీజియం వ్యవస్థ కొనసాగుతుందని, రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణేమీ లేదన్నారు.
భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి?: సీజేఐ
ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయని, ఏదీ పరిపూర్ణమైనది కాదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసుకున్న కొలీజియం ఉత్తమమైనదని ఆయన సమర్థించారు. కొలీజియం వ్యవస్థపై, కొన్ని సిఫార్సులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు అసంతృప్తి వ్యక్తంచేయడంపైనా సీజేఐ ప్రతిస్పందించారు. ‘ఆ విషయంలో న్యాయ మంత్రితో వాదనలు చేయాలనుకోవట్లేదు. ఆయనకో అభిప్రాయం ఉంది, నాకో అభిప్రాయం ఉంది. భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి? న్యాయ వ్యవస్థలోనే కాదు ప్రభుత్వంలోనూ అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘కొలీజియం ప్రధాన లక్ష్యం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడం, బాహ్య ప్రభావాల నుంచి దానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడమే’నని అభిప్రాయపడ్డారు. వ్యవస్థను ఉన్నది ఉన్నట్లుగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతని పేర్కొన్నారు. జడ్జీల నియామకాలకు సరైన నియమ నిబంధనలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై వస్తున్న ట్రోలింగ్స్‌పై మాట్లాడుతూ...అలాంటి వ్యంగ్యాస్త్రాలు తమను ప్రభావితం చేయలేవన్నారు. మాజీ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ కొలీజియం వ్యవస్థ ఆదర్శప్రాయమైనదని పేర్కొనగా మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే దానిని సమర్థిస్తూనే ప్రభుత్వ అభిప్రాయం కూడా కీలకమేనన్నారు.
తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ ‘‘కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. న్యాయమూర్తిగా నా 23 ఏళ్ల కెరీర్‌లో ఏ కేసు విషయంలోనూ ఇలాంటి తీర్పు ఇవ్వాలని ఎవరూ చెప్పలేదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
సెలవుల్లోనూ న్యాయమూర్తులకు పని
కోర్టుకు అధిక సంఖ్యలో సెలవులు ఉంటున్నాయని, దీనివల్ల సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందన్న వ్యాఖ్యలను సీజేఐ తోసిపుచ్చారు. న్యాయమూర్తులకు వాస్తవంగా ఎలాంటి సెలవులూ ఉండవని, వారమంతా రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తుందన్నారు. రేపు కోర్టు ముందుకు రాబోయే కేసుల్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం కోర్టు వేళలు ముగిసిన తర్వాత చదవాల్సి ఉంటుందని తెలిపారు. రోజువారీగా రిజర్వు చేసే తీర్పులను శనివారం రాయాల్సి ఉంటుంది. సోమవారం కోర్టు ముందుకొచ్చే కేసులను ఆదివారం చదవాల్సి వస్తుందని వివరించారు. ప్రపంచంలో ఏ దేశ సుప్రీంకోర్టూ మనంత సుదీర్ఘంగా పనిచేయడంలేదంటూ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్ దేశాల సుప్రీంకోర్టుల సెలవుల వివరాలను తెలిపారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీల నియామక విధానంపై ప్రభుత్వ వర్గాలు, న్యాయ వ్యవస్థల మధ్య మరోసారి గట్టి సంవాదం జరిగింది. ‘ఇండియాటుడే కాంక్లేవ్-2023’ ఈ సారి అందుకు వేదికయింది. కొన్ని లోపాలున్నా కొలీజియం వ్యవస్థ ఉత్తమమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమర్థించగా.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం జడ్జీల నియామకాల బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని ఉద్ఘాటించారు. రాజ్యాంగం ఆ విధిని ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థ మనుగడలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!