ఉపాధి హామీలో ఒకే వేతనం అమలు చేయాలి

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నందున రాష్ట్రాల్లో ఒకే కూలీ రేటును ఉండేలా చూడాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

Updated : 19 Mar 2023 06:10 IST

పని దినాలనూ పెంచాలి
పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు

ఈనాడు, దిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నందున రాష్ట్రాల్లో ఒకే కూలీ రేటును ఉండేలా చూడాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అలాగే ఈ పథకం కింద పని దినాలను కూడా పెంచాలని పేర్కొంది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అనుసరించి గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ఈ పథకం కింద కూలీ రేట్లను నిర్ధారిస్తోంది. ఇందులో సార్వత్రిక విధానం అనుసరించడం లేదు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో రోజువారీ కూలీ రూ.204 ఉంటే, గోవాలో రూ.315, హరియాణాలో రూ.331, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రూ.257 దాకా ఉంది. ఇలా రాష్ట్రానికో రేటు అనుసరించడం మంచిది కాదు. ప్రస్తుతం కూలీలు రాష్ట్రాల్లో రూ.200 నుంచి రూ.300 వరకు నడుస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న రోజువారీ ఖర్చులకు తగ్గట్టు వేతనాలు పెంచడానికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే కూలీ రేటు అమలుకు సూచికను ఖరారు చేయాలి’’ అని స్థాయీ సంఘం పేర్కొంది. పథకం ప్రారంభమై 15 ఏళ్లయినా ఇప్పటికీ 100 రోజుల వార్షిక పని దినాలనే అమలు చేయడం పట్ల స్థాయీ సంఘం పెదవి విరిచింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారిపోయాయని, ఏటా మార్పులు చేయాల్సిన అవసరాన్ని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మారుతున్న కాలం, డిమాండ్‌కు తగ్గట్టు ఇందులో మార్పులు చేయాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని