డెల్టా భూములు సముద్రం పాలు

వాతావరణ మార్పులకు స్థానిక కారణాలూ తోడై ఈ శతాబ్దాంతానికి ప్రపంచ డెల్టా భూముల్లో అత్యధిక భాగం సముద్రంలో కలసిపోవచ్చని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

Published : 19 Mar 2023 04:18 IST

శతాబ్దాంతానికి తప్పదంటున్న అధ్యయనం

దిల్లీ: వాతావరణ మార్పులకు స్థానిక కారణాలూ తోడై ఈ శతాబ్దాంతానికి ప్రపంచ డెల్టా భూముల్లో అత్యధిక భాగం సముద్రంలో కలసిపోవచ్చని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. డెల్టాలో భూగర్భ జలాలను, చమురు, సహజవాయు నిక్షేపాలనూ తోడివేయడం, సముద్ర తీర మడ అడవులు, ఇతర వృక్షజాలం హరించుకుపోవడం వల్ల నేల కుంగి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. సాధారణంగా భూతాపం సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీస్తుంది. దీనికితోడు డెల్టా ప్రాంతాల్లో నేలకుంగి సముద్రం పాలవుతుందని వారు వివరించారు. చిరకాలంగా ఎగువ ప్రాంతాల నుంచి నదులు తీసుకొచ్చే ఒండ్రు మట్టి.. డెల్టాలో కొత్త భూములు విస్తరించడానికి తోడ్పడుతుంది. సముద్ర మట్టాలు పెరిగినా డెల్టా ముంపునకు గురవకుండా రక్షిస్తుంది. ఇప్పుడు అదంతా పాత కాలపు మాట అయింది. నదులకు ఎగువన భారీ ఆనకట్టలు, జలాశయాలు నిర్మించడం వల్ల కిందకు కొట్టుకొచ్చే ఒండ్రుమట్టి తగ్గిపోతోంది. డెల్టాలోనూ కరకట్టలు, లాకుల నిర్మాణం వల్ల వచ్చే కాస్త ఒండ్రుమట్టి సువిశాలంగా పరచుకోలేకపోతోంది. నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడే డెల్టా భూములు సముద్రమట్టం కన్నా కొద్ది ఎత్తులోనే ఉంటాయి. ప్రపంచంలో మొత్తం భూ విస్తీర్ణంలో డెల్టా భూముల వాటా 0.5 శాతమే అయినా, అవి ప్రపంచ జీడీపీకి 4 శాతం వాటా, ప్రపంచ పంటల ఉత్పత్తిలో 3 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 5.5 శాతం డెల్టా ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వాతావరణ మార్పుల నిరోధంతోపాటు డెల్టా భూముల్లో సహజ వనరుల అతి వినియోగాన్నీ అరికట్టడం తక్షణావసరమని శాస్త్రవేత్తలు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు