రాహుల్ ఇంటి వద్ద హైడ్రామా
‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు.
మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణకు పోలీసుల రాక
బయట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
గంటపాటు భేటీ అయి వివరాలడిగిన పోలీసులు
ఆ తర్వాత ప్రాథమిక సమాధానం పంపిన కాంగ్రెస్ అగ్రనేత
10 రోజుల్లో వివరంగా జవాబిస్తానని వెల్లడి
ఇప్పుడొచ్చి హడావుడి చేయడమేంటని ధ్వజం
దిల్లీ: ‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, బాధితుల వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారని తెలియడంతో రాహుల్ ఇంటివద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనరు సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీసు బృందం ఉదయం 10 గంటలకు రాహుల్ ఇంటికి వచ్చింది. అప్పటికే ఆయన ఇంటిచుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు గంటలు వేచి ఉన్నాక రాహుల్‌ను కలిసిన పోలీసు బృందం బాధితుల వివరాలను కోరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలీసులు వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నప్పుడే కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, అభిషేక్ మను సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులు రాహుల్ ఇంటికి వచ్చారు. ఆయన ఇంటి బయట ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచి పెట్టారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బాధితులు ఆయనను కలిసి ఫిర్యాదు చేస్తే ఆ వివరాలను ఇవ్వాలని, వారికి భద్రత కల్పిస్తామని అంటున్నారు. ఇప్పటికే స్థానికంగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని విచారించామని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే రాహుల్ గాంధీని అడిగి వివరాలు తెలుసుకోవాలనుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను కలిసేందుకు వచ్చామని.. వివరాలిస్తే చర్యలకు సిద్ధమని హుడా తెలిపారు.
ప్రాథమిక సమాధానం పంపిన రాహుల్
దిల్లీ పోలీసుల నోటీసుపై ఆదివారం నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని రాహుల్ గాంధీ పంపారు. 5 రోజుల్లో 3 సార్లు తనను కలిసేందుకు పోలీసులు రావడంపై ఆయన స్పందించారు. 10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. పోలీసుల తీరు దారుణమని, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారా అని ఈ సందర్భంగా నిలదీశారు. తాను వ్యాఖ్యలు చేసిన 45 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేమిటని ప్రశ్నించారు.
హిట్లర్‌కేమైందో అందరికీ తెలుసు: కాంగ్రెస్
ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. రాజకీయ సభల్లో చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయడంద్వారా భాజపా తప్పుడు సంకేతాలను పంపుతోందని, ఆ పార్టీ నేతలూ పలు సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలే చేశారని స్పష్టం చేశారు. అప్పట్లో జనతా పార్టీ ఇలాగే వ్యవహరించిందని, దీంతో 1980లో ఇందిరా గాంధీని ప్రజలు మళ్లీ భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. అడాల్ఫ్ హిట్లర్ మొదట్లో ఇలాగే చేశారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలివ్వడమే కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తోందని విమర్శించారు. నియంతృత్వాన్ని అంగీకరించేది లేదని, ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
సావర్కర్ కాదు.. ఆయన పేరు రాహుల్
‘ఆయనను సావర్కర్ అనుకుంటున్నారా? ఆయన పేరు రాహుల్ గాంధీ’ అని, ఎవరికీ తలొగ్గరని పేర్కొంటూ కేంద్రం తీరుపై కాంగ్రెస్ ట్విటర్‌లో విమర్శలు చేసింది. డ్రైవరు సీట్లో కూర్చున్న రాహుల్ గాంధీ చిత్రాన్ని ట్వీట్‌కు జత చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. గొప్ప నేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
సమాచారం ఇవ్వాల్సిందే: భాజపా
ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీ సమాచారం ఇవ్వాల్సిందేనని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండు చేశారు. ఆయన ఆరోపించిన సంఘటనలకు సంబంధించి పోలీసులకు ఆధారాలు కావాల్సి ఉందని, అందుకే రాహుల్‌ను వారు సంప్రదించారని పేర్కొన్నారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తుంటే కక్ష సాధింపని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు
-
సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు
-
YV Subbareddy: ఏ హోదాలో వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం?
-
విలాస హోటల్‌గా చర్చిల్ పాత యుద్ధ కార్యాలయం