మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ

తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి బాధ్యతలు చూసే మహిళలకు ‘మగళిర్‌ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు)’ పథకాన్ని ప్రకటించారు.

Updated : 21 Mar 2023 07:35 IST

తమిళనాడు బడ్జెట్‌లో కీలక ప్రకటన

ఈనాడు, చెన్నై: తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి బాధ్యతలు చూసే మహిళలకు ‘మగళిర్‌ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు)’ పథకాన్ని ప్రకటించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబపెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులైనవారికి ఈ పథకం అందుబాటులోకి వస్తుందన్నారు. సెప్టెంబరు 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ దీన్ని ప్రారంభిస్తారని త్యాగరాజన్‌ తెలిపారు. పెరిగిన గ్యాస్‌ ధరలు మహిళల్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని, ఈ పథకంతో వారు ఊరట చెందుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ పథకానికి తాజా బడ్జెట్లో రూ.7 వేల కోట్లు కేటాయించారు. అయితే అర్హులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారన్నది వెల్లడించలేదు. మరోవైపు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమిళ సైనికులకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాను రూ.20 నుంచి రూ.40 లక్షలకు పెంచారు. వివిధరకాల సేవా పతకాలు పొందిన తమిళ సైనికులకు ఇచ్చే గ్రాంటును 4 రెట్లు పెంచుతున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని