Amritpal Singh: అమృత్‌పాల్‌ వెనుక ఐఎస్‌ఐ!

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌సింగ్‌ వెనుక పాకిస్థాన్‌ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.

Updated : 21 Mar 2023 07:47 IST

విదేశీ నిధులూ   అందుతున్నట్లు అనుమానం
ఐదుగురిపై ఎన్‌ఎస్‌ఏ కింద కేసు
నిందితుడి మామయ్య, డ్రైవరు లొంగుబాటు

చండీగఢ్‌: ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌సింగ్‌ వెనుక పాకిస్థాన్‌ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ ముఠాలే మెర్సిడెజ్‌ కారును సింగ్‌కు బహుమతిగా ఇచ్చాయనీ, ఆయుధ సహకారాన్ని ఐఎస్‌ఐ అందిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ కన్నుగప్పి తప్పించుకున్నప్పుడూ ఇదే కారులో సింగ్‌ ఉన్నట్లు వారు గుర్తుచేశారు. నిందితుడికి ఓ ప్రైవేటు సైన్యం ఉందని తెలిపారు. ఐదుగురు వ్యక్తులపై ‘జాతీయ భద్రత చట్టం’ (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పంజాబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుఖ్‌చైన్‌సింగ్‌ గిల్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకు ఆరు కేసులు నమోదు చేసి, 114 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. శనివారం రాత్రి జలంధర్‌లో లొంగిపోయిన నిందితుని మామయ్య హర్జీత్‌సింగ్‌పైనా ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదైందని, అతనినీ డిబ్రూగఢ్‌ జైలుకు తరలిస్తామని వివరించారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేశాక అతనిపైనా ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదు చేస్తామన్నారు.

నకిలీ ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనన్న న్యాయవాది

ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమృత్‌పాల్‌ మామయ్యతోపాటు డ్రైవర్‌ హర్‌ప్రీత్‌సింగ్‌ కూడా లొంగిపోయారు. మొబైళ్లలో అంతర్జాల సేవలు, ఎస్‌ఎంఎస్‌లపై నిషేధాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. కొందరి ట్విటర్‌ ఖాతాలు స్తంభించిపోయాయి. అమృత్‌పాల్‌ను నకిలీ ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టేందుకు పోలీసులు యోచిస్తున్నారని, ఇప్పటికే అరెస్ట్‌ చేశారని ‘వారీస్‌ పంజాబ్‌ దే’ న్యాయవాది ఇమాన్‌సింగ్‌ ఖారా చెప్పారు.


సింగ్‌ రాటుదేలింది జార్జియాలో..

(ఇంటర్నెట్‌ డెస్క్‌): ఖలిస్థాన్‌ ఉద్యమకారుడు అమృత్‌పాల్‌ సింగ్‌ చరిత్ర తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చాలాకాలం దుబాయ్‌లో ఉన్న అమృత్‌పాల్‌కు అక్కడే ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయి.

ట్రక్కు డ్రైవరుగా దుబాయ్‌కి

అమృత్‌పాల్‌ 2012లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసేందుకు దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్‌ నేత లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే సోదరుడు జస్వంత్‌, ఉగ్రవాది పరమ్‌జీత్‌ సింగ్‌ పమ్మాతో పరిచయం ఏర్పడింది. దుబాయ్‌ నుంచి మన దేశానికి చేరుకోవడానికి ముందు అమృత్‌పాల్‌ జార్జియాకు వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడే ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొంది రాటుదేలినట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో అశాంతి రేకెత్తించడానికి పక్కా వ్యూహంతోనే దేశంలో అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత ‘వారిస్‌ పంజాబ్‌ దే’ను గుప్పిట్లోకి తీసుకుని వేగంగా ఎదిగాడు. ‘సిక్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థతో కూడా సంబంధాలున్నాయి. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు ఆయుధాలు సమకూరినట్లు అనుమానిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన అవతార్‌ సింగ్‌ ఖండా అనే వ్యక్తి అమృత్‌పాల్‌కు ప్రధాన సహాయకారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అవతార్‌ సింగ్‌, పమ్మా మధ్య మంచి సంబంధాలున్నాయి. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్‌పాల్‌ ఎదుగుదల వెనుక అవతార్‌ ప్రణాళికలు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

కెనడా వీసాకు అమృత్‌పాల్‌ భార్య దరఖాస్తు

అమృత్‌పాల్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అమృత్‌పాల్‌ కూడా నేపాల్‌ మీదుగా కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్ఠం చేయాలని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)లను కేంద్రం ఆదేశించింది. కిరణ్‌దీప్‌ కౌర్‌ యూకేకు చెందిన ఎన్నారై. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారి పెళ్లి జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు