ఇండో-పసిఫిక్‌ శాంతికి భారత్‌-జపాన్‌ భాగస్వామ్యం కీలకం

ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ పాలనపై గౌరవం ఆధారంగా భారత్‌, జపాన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 21 Mar 2023 06:15 IST

జపాన్‌ ప్రధాని కిషిదతో భేటీ అనంతరం మోదీ ప్రకటన

దిల్లీ: ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ పాలనపై గౌరవం ఆధారంగా భారత్‌, జపాన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీన్ని మరింత విస్తరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమే కాక, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమన్నారు. భారత్‌ పర్యటనలో భాగంగా సోమవారం దిల్లీకి వచ్చిన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదతో చర్చలు జరిపిన అనంతరం మోదీ ఈ మేరకు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో మోదీ, కిషిద భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై వారిద్దరూ ప్రధానంగా చర్చించారు. చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంపైనా వారు సమాలోచనలు జరిపారు. భారత్‌ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుతోపాటు జపాన్‌ సారథ్యంలో నిర్వహించనున్న జీ7 సమావేశాల్లో ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి కలసికట్టుగా పనిచేయాలని మోదీ, కిషిద తీర్మానించుకున్నారు. మే నెలలో జపాన్‌లోని హిరోషిమాలో జరిగే జీ7 సమావేశాలకు మోదీని ఆహ్వానించగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు కిషిద చెప్పారు. ఈ చర్చల సందర్భంగా ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కోసం జపాన్‌ రుణంలో నాలుగో విడతగా 300 బిలియన్ల యెన్‌ల(రూ.18 వేల కోట్లు) నిధుల జారీకి సంబంధించి రెండు దేశాలు పత్రాలు మార్చుకున్నాయి.

జీ20 నేపథ్యంలో ఈ భేటీ ప్రత్యేకం: మోదీ

ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు మోదీ తెలిపారు. ‘‘వచ్చే అయిదేళ్లలో భారత్‌లో జపాన్‌ రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని గత ఏడాదిలో లక్ష్యాన్ని విధించుకున్నాం. ఆ దిశగా జరిగిన పురోగతి సంతృప్తికరంగా ఉంది’’ అని మోదీ తెలిపారు. జీ20కి భారత్‌, జీ7కు జపాన్‌ అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రత్యేకమని మోదీ అన్నారు.  

భారత్‌ పాత్ర కీలకం: కిషిద

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు భారత్‌ ఎంతో కీలకమని కిషిద ఉద్ఘాటించారు. సోమవారం ఆయన దిల్లీలో దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి తన ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం ఈ మేరకు ప్రసంగించారు.

కిషిదకు మోదీ ప్రత్యేక కానుక

జపాన్‌ ప్రధాని కిషిదకు మోదీ ప్రత్యేక కానుక ఇచ్చారు. చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు. బోధి వృక్షం కింద బుద్ధుడు ధ్యానముద్రలో ఉన్న ఈ కళాకృతి వెనుక కర్ణాటక సంపన్న వారసత్వం ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో కళాకారులు చందనపు చెక్కపై చేతులతోనే ప్రత్యేక నైపుణ్యంతో బొమ్మలను చెక్కే సంప్రదాయం ఉందని వివరించారు. బాల్‌బోధి మొక్కను కూడా కిషిదకు మోదీ బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని