3 నెలల్లో ఆర్టీఐ దరఖాస్తులకు ఆన్‌లైన్‌ పోర్టళ్లు

దేశంలోని అన్ని హైకోర్టులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టళ్లను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 21 Mar 2023 05:13 IST

హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టళ్లను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టం ప్రకారం.. అందరికీ సమాచారం అందాలంటే మరింత సౌకర్యవంతంగా ఉండాలని సూచించింది. ఆర్టీఐ దరఖాస్తుల దాఖలుకు అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్ధీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులోనూ ఆన్‌లైన్‌లో ఆర్టీఐ దరఖాస్తుల స్వీకరణకు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సూచనలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. జిల్లాల న్యాయస్థానాల విషయంలో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సూచనలను తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.

ప్రతివాదిగా సీజేఐని చేర్చడంపై ఆగ్రహం

సీనియర్‌ న్యాయవాదులుగా గుర్తింపు ఇచ్చే అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో సీజేఐని ప్రతివాదిగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మాథ్యూస్‌ జె.నెడుంపర తదితరులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో సీజేఐని, పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని మండిపడింది. ‘మీరు 40ఏళ్ల అనుభవమున్న న్యాయవాది. అలాంటి మీరు సీజేఐ, పూర్తిస్థాయి ధర్మాసనాలను ప్రతివాదులుగా ఎలా పేర్కొంటారు? ముందు మీ మెమోను సరిచేయండి’ అని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.అమానుల్లా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనరును ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం పట్ల ఇలాంటి అసంబద్ధ వైఖరిని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఆ రెండు పేర్లను తొలగించేందుకు పిటిషనరు అంగీకరించారు.

‘రామ సేతుపై నిర్ణయం తీసుకోండి’

రామ సేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ భాజపా నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రామ సేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం జనవరి 19న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్వామి తన అభ్యర్థనలో పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కేంద్రం తొమ్మిదేళ్లకుపైగా ఈ విషయంలో జాప్యం చేసిందని స్వామి తెలపగా, ఆ విషయాన్ని ఇప్పటికే గుర్తించామని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని