సంక్షిప్త వార్తలు(8)
కొవిడ్-19 లక్షణాలు దీర్ఘకాలం కొనసాగడం (లాంగ్ కొవిడ్) వల్ల ముఖాలను గుర్తించడంలో బాధితులకు ఇబ్బందులు తలెత్తవచ్చని తాజా పరిశోధన తేల్చింది.
దీర్ఘకాల కొవిడ్‌తో ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ ముప్పు
దిల్లీ: కొవిడ్-19 లక్షణాలు దీర్ఘకాలం కొనసాగడం (లాంగ్ కొవిడ్) వల్ల ముఖాలను గుర్తించడంలో బాధితులకు ఇబ్బందులు తలెత్తవచ్చని తాజా పరిశోధన తేల్చింది. ఈ సమస్యను ‘ఫేస్ బ్లైండ్‌నెస్’గా పిలుస్తారు. బాగా తెలిసిన ప్రదేశానికి వెళ్లడంలోనూ వారు ఇబ్బంది పడతారని చెప్పారు. దీర్ఘకాల కొవిడ్ వల్ల పలు సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే వెల్లడైంది. ఫేస్ బ్లైండ్‌నెస్ గురించి వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ ఇబ్బంది ఉన్నవారు బాగా పరిచయమున్న వ్యక్తుల ముఖాలనూ సరిగా గుర్తించలేరు. 2020 మార్చిలో అమెరికాలో కొవిడ్ బారినపడ్డ ఆనీ అనే 28 ఏళ్ల మహిళలో ఈ సమస్యను ఉన్నట్లు గమనించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యుల ముఖాలనూ గుర్తించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాల కొవిడ్ బారినపడ్డ కొందరిలోనూ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు.
కుంగుబాటుకు కొత్తరకం చికిత్సలు
దిల్లీ: ఒత్తిడితో కలిగే కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు కొత్త విరుగుడును కనిపెట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కారం చేశారు. మానవులు, ఎలుకల పేగుల్లోని రోగనిరోధక కణాలు అక్కడి ప్రయోజనకర బ్యాక్టీరియా కూర్పులో మార్పులు కలిగిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతిమంగా కుంగుబాటు వంటి రుగ్మతలతో ముడిపడ్డ మెదడు విధులపై ఇది ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు. ఆ రోగ నిరోధక కణాల్లోని గ్రాహకాలను లక్ష్యంగా చేసుకొని కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పేగుల్లోని గామా డెల్టా టి కణాలు, వాటి ఉపరితలంపై ఉండే డెక్టిన్-1 అనే ప్రొటీన్ గ్రాహకాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. మానసిక ఒత్తిడి స్పందనలను మార్చడంలో ఈ కణాలకు ప్రమేయం ఉందని ఇప్పటివరకూ పరిశోధకులకు తెలియదు. ఎలుకలపై ప్రయోగాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఒత్తిడి ఎదుర్కొంటున్న మూషికాల పేగు బ్యాక్టీరియాలో వైవిధ్యం లోపించిందని తేల్చారు. ముఖ్యంగా ఎల్ జాన్సనై అనే ప్రయోజనకర సూక్ష్మజీవుల పరిమాణం తగ్గిపోయినట్లు గుర్తించారు. ఒత్తిడి వల్ల డెల్టా టి కణాలు పెరుగుతాయని, ఫలితంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని వివరించారు. కుంగుబాటు వల్ల ఆ జీవులు.. ఇతర మూషికాలతో కలవడంలేదని తేల్చారు. వీటి పేగుల్లోకి ఎల్.జన్సనై సూక్ష్మజీవులను అదనంగా ప్రవేశపెట్టినప్పుడు ఈ తరహా సామాజిక వ్యవహారశైలి తగ్గిందని గుర్తించారు. వాటిలో డెల్టా టి కణాలు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్
ఈనాడు, దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని, లేకుంటే దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. చట్టబద్ధత కల్పిస్తే రైతులతోపాటు దేశానికి మేలు కలుగుతుందని చెప్పారు. వచ్చే నెల 5న దిల్లీలో నిర్వహించనున్న మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీని పురస్కరించుకుని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మిక, వ్యవసాయ చట్టాలతో నయా ఉదారవాద విధానాలను అమలు చేసేందుకు పాలక భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర దక్కక దేశంలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న 5 లక్షల మంది దిల్లీకి చేరుకుంటారని తెలిపారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ.. ఎంఎస్పీని చట్టబద్ధం చేయడం, కార్మిక చట్టాల రద్దు, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తమ ఆందోళన సాగుతుందని తెలిపారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. దేశంలోని దళితులపై గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ మద్దతుతో దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
రద్దయిన నోట్ల ఆమోదంపై విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
కేంద్రాన్ని సంప్రదించాలని సూచన
దిల్లీ: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను ఆమోదించాలని కోరుతూ దాఖలైన వ్యక్తిగత పిటిషన్‌లను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించొచ్చని వెల్లడించింది. ఎవరైనా తమ వ్యక్తిగత అభ్యర్థనలతో 12 వారాల్లోగా సంప్రదిస్తే వాటిని పరిశీలించాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి మంగళవారం సూచించింది. కేంద్రప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందకపోతే సంబంధిత హైకోర్టును ఆశ్రయించొచ్చని పిటిషన్‌దారులకు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను ఈ ఏడాది జనవరి 2న సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంకును సంప్రదించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నందున కేంద్రాన్ని తప్పుపట్టలేమని వ్యాఖ్యానిస్తూ రద్దు నిర్ణయాన్ని 4-1తో రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తీర్పు స్పష్టంగా ఉన్నందున ఆర్టికల్ 142 కింద ఈ కేసులను తాము విచారించలేమని ద్విసభ్య ధర్మాసనం తాజాగా వ్యాఖ్యానించింది.
కక్షిదారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త
న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు సూచన
దిల్లీ: కక్షిదారులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసే విషయంలో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. ప్రస్తుతం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాల వ్యాఖ్యలతో కక్షిదారుల ప్రతిష్ఠకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ‘‘వర్చువల్ విచారణలు, ప్రత్యక్ష ప్రసారాల వల్ల సంధానత, పారదర్శకతల విషయంలో న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పారదర్శకత లేదు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేసమయంలో విచారణల నిర్వహణ సమయంలో న్యాయమూర్తుల బాధ్యతలూ పెరిగాయి’’ అని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎ.అమానుల్లాల నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లంచం కేసుకు సంబంధించిన బెయిలు పిటిషన్‌పై గత ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ ఈ మేరకు పేర్కొంది. నాడు హైకోర్టు.. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
‘ఎన్నికల బాండ్ల’పై విచారణ 11కు వాయిదా
దిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా.. లేదా.. అన్న విషయాన్ని త్వరలో తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.12,000 కోట్లను రాజకీయ పార్టీలకు ఇచ్చారని, అందులో మూడింట రెండొంతుల నిధులు ఒకే పార్టీకి అందాయని ఆరోపిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. త్వరలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నందున అసలు ఎన్నికల బాండ్ల పథకం చెల్లుతుందా లేదా అన్నది తేల్చాలని కోరింది. ఈ అంశంపై పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే విషయమై ఏప్రిల్ 11న నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
ఎరువుకు ‘కులం’ ముడి
ఈనాడు, దిల్లీ: ఎరువుల కొనుగోలు సమయంలో ఎరువుల విక్రయ కేంద్రాల (పీవోఎస్) వద్ద మిషన్లలో రైతుల ‘కులం’ పేరు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. సమాచారం సేకరణకే ఈ నిబంధన పెట్టినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ కుబ తెలిపారు. ఎరువుల కొనుగోలు సమయంలో రైతుల కులం వివరాలు కోరుతున్నారా? అంటూ తమిళనాడుకు చెందిన పీఎంకే రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. భవిష్యత్తులో కులాల ఆధారంగా రైతులకు ఎరువులపై రాయితీ వర్తింపజేసే ఆలోచన ఏమైనా ఉందా అని ఎంపీ ప్రశ్నించగా అటువంటి యోచన పరిగణనలో లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఛోక్సీపై రెడ్ నోటీసు పునరుద్ధరించండి
- సీసీఎఫ్‌ను కోరిన సీబీఐ
దిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీపై రెడ్ నోటీసును పునరుద్ధరించాలని ఇంటర్‌పోల్‌కు చెందిన సీసీఎఫ్ (కమిషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇంటర్ పోల్ ఫైల్స్) విభాగాన్ని సీబీఐ కోరింది. నిరుడు ఛోక్సీ విజ్ఞప్తిని పురస్కరించుకుని సీసీఎఫ్ ఆయనపై రెడ్ నోటీసును ఉపసంహరించింది. ఆ చర్య లోపభూయిష్టమనీ, నిబంధనలకు విరుద్ధమనీ పేర్కొంటూ సీబీఐ ఆయనపై రెడ్ నోటీసును పునరుద్ధరించాలని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన ఛోక్సీ 2018 జనవరిలో దేశం నుంచి పరారైన విషయం తెలిసిందే. రెడ్ నోటీస్ నుంచి ఛోక్సీ పేరు తొలగింపును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. విపక్షాలపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్న భాజపా సర్కారు... ప్రధాని మోదీ మిత్రుడు మెహుల్ ఛోక్సీకి మాత్రం ఇంటర్‌పోల్ నుంచి విముక్తి కలగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
బెంగాల్లో పెళ్లింట మహావిషాదం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్