ప్రజాప్రతినిధుల కోర్టులు.. ఆ కేసుల్నే విచారించాలి

ప్రజాప్రతినిధులకు ప్రమేయమున్న క్రిమినల్‌ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానాలు కేవలం వాటినే విచారించేలా హైకోర్టులకు గంపగుత్త ఆదేశాలను ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Updated : 22 Mar 2023 05:00 IST

అమికస్‌ క్యూరీ సూచన
అలా గంపగుత్త ఆదేశాలను ఎలా ఇవ్వగలం?
సుప్రీంకోర్టు ప్రశ్న

దిల్లీ: ప్రజాప్రతినిధులకు ప్రమేయమున్న క్రిమినల్‌ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానాలు కేవలం వాటినే విచారించేలా హైకోర్టులకు గంపగుత్త ఆదేశాలను ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కోర్టు సహాయకుడు (అమికస్‌ క్యూరీ) విజయ్‌ హన్సారియా ఇచ్చిన 17వ నివేదికను పరిశీలిస్తున్న క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రమేయమున్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగంగా జరిగేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన వ్యాజ్యం విచారణలో ఆయన కోర్టు సహాయకుడిగా ఉన్నారు. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 5వేలు దాటిపోయిందని హన్సారియా పేర్కొన్నారు. అందువల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలపై అపరిష్కృతంగా ఉన్న కేసులను సత్వరం విచారించేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనానికి విన్నవించారు. తాను దాఖలు చేసిన 17వ నివేదికను పరిశీలించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. హన్సారియా నివేదికలోని సూచనలను పరిశీలించింది. హైకోర్టులకు గంపగుత్త ఆదేశాలను ఇవ్వలేమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ‘‘కొన్ని ప్రత్యేక కోర్టుల్లో.. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులు తక్కువగా ఉండొచ్చు. మిగతాచోట్ల ఎక్కువగా ఉండొచ్చు. ఆయా జిల్లాల్లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలతో నివేదిక ఉంటే.. దాని ఆధారంగా వేగవంతమైన విచారణకు నిర్దిష్ట ఆదేశాలను జారీ చేయవచ్చు’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని