అఫ్గాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం.. దిల్లీ సహా ఉత్తరాదిపై ప్రభావం

అఫ్గానిస్థాన్‌లోని హిందు-ఖుష్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.20 గంటలకు సంభవించిన భూకంపం ఆ దేశంలోనే కాకుండా చుట్టుపక్కల పలు దేశాలపై ప్రభావం చూపించింది.

Updated : 22 Mar 2023 04:54 IST

హిందు-ఖుష్‌ కేంద్రంగా ప్రకంపనలు
చుట్టుపక్కల పలు దేశాల్లో కదిలిన భూమి
తీవ్రత 6.8 దాకా నమోదు

ఇస్లామాబాద్‌, దిల్లీ: అఫ్గానిస్థాన్‌లోని హిందు-ఖుష్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.20 గంటలకు సంభవించిన భూకంపం ఆ దేశంలోనే కాకుండా చుట్టుపక్కల పలు దేశాలపై ప్రభావం చూపించింది. తుర్క్‌మెనిస్థాన్‌, కజక్‌స్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనా, కిర్గిస్థాన్‌లలోనూ భూమి కంపించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌పై, మన దేశ ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం పడింది. అఫ్గాన్‌లో దీని తీవ్రత 6.6గా భూకంప లేఖినిపై నమోదైంది. భూకంప కేంద్రం ఆ దేశంలోని ఫాయిజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కి.మీ. దూరంలో.. 180 కి.మీ.లోతున ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌, పెషావర్‌, ఝీలం, స్వాత్‌ తదితర ప్రాంతాల్లోనూ 6.8 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప సమయంలో పాకిస్థాన్‌లోని రావల్పిండి మార్కెట్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

భారత్‌లో..

దిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూ-కశ్మీర్‌, రాజస్థాన్‌లలో అనేకచోట్ల భూ ప్రకంపనల ప్రభావం తెలియవచ్చింది. భూమి కంపించడంతో భయపడిన ప్రజలు ఆయా భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. డైనింగ్‌ టేబుల్‌తోపాటు ఇంట్లో ఫ్యాన్లు ఊగుతుండడాన్ని గమనించినట్లు నొయిడా నివాసి ఒకరు తెలిపారు. తీవ్రత ఎక్కువగా అనిపించిందనీ, ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని మరికొందరు చెప్పారు. తమ ఇంట్లో టీవీ, సోఫా కదిలిపోవడంతో భూకంపం గురించి తెలిసిందని దిల్లీ దక్షిణ భాగంలోని లజ్‌పత్‌నగర్‌ నివాసి జ్యోతి తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తినష్టాలపై వెంటనే ఎలాంటి వివరాలు అందలేదు. జమ్మూ ప్రాంతంలో కొంతసేపు మొబైల్‌ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని