750 కి.మీ. వెంటాడి.. గుజరాత్‌లో అరెస్టు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతను డబ్బు కోసం వేధించిన కేసులో కీలక నిందితుడు అనిల్‌ జైసింఘానీని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 22 Mar 2023 05:17 IST

అమృతా ఫడణవీస్‌ను బెదిరించిన కేసు వ్యవహారం

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతను డబ్బు కోసం వేధించిన కేసులో కీలక నిందితుడు అనిల్‌ జైసింఘానీని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా మార్చి 27 వరకు రిమాండు విధించారు. జైసింఘానీ ఫోన్లను మార్చేస్తూ రెండుసార్లు పోలీసుల కళ్లుగప్పి సినీఫక్కీలో తప్పించుకొన్నాడు. చివరికి అతడిని గుజరాత్‌లోని వడోదర సమీప కోలాల్‌ వద్ద ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఇందుకోసం పోలీసులు 72 గంటలపాటు ‘ఆపరేషన్‌ ఏజే’ పేరిట పరుగులు తీయాల్సి వచ్చింది. దాదాపు 750 కిలోమీటర్లు అతడిని వెంటాడినట్లు సైబర్‌ పోలీస్‌ డీసీసీ బాలాసింగ్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. మహారాష్ట్రలోని అతిపెద్ద క్రికెట్‌ బుకీల్లో ఒకడైన జైసింఘానీపై దాదాపు 15 కేసులు ఉన్నాయి. అనిల్‌ మొబైల్‌ లొకేషన్‌ను తొలిసారి గుజరాత్‌లో శుక్రవారం గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది సూరత్‌కు మారిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకొనేసరికి.. అనిల్‌ ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని వెంటాడి చివరికి కొలాల్‌ సమీపంలో అదుపులోకి తీసుకొన్నారు. అనిల్‌ సిమ్‌కార్డుల నుంచి ఫోన్లు అసలు చేయడని, ఇంటర్నెట్‌ ఆధారిత వీవోఐపీ కాల్స్‌ మాత్రమే చేస్తాడని పోలీసులు తెలిపారు. వేర్వేరు పేర్లతో డాంగిల్స్‌ను కొనుగోలు చేసేవాడు. వాటిని ప్రతి అయిదారు రోజులకు మార్చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి రెండు డాంగిల్స్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని