ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం

దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

Updated : 23 Mar 2023 05:57 IST

50 మందికి అందించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పద్మాలు అందుకున్న వారిలో 8 మంది తెలుగు ప్రముఖులు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన యాభై మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రకటించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ, వాస్తు శిల్పి బాలకృష్ణ దోషి (మరణానంతరం) దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్‌ మంగళం బిర్లా, రచయిత, ప్రొఫెసర్‌ కపిల్‌ కపూర్‌, ఆధ్యాత్మికవేత్త, రామచంద్రమిషన్‌ అధ్యక్షుడు కమలేశ్‌ డి పటేల్‌(తెలంగాణ), నేపథ్య గాయని సుమన్‌ కల్యాణ్‌పుర్‌ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ను స్వీకరించారు. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(మరణానంతరం)కు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన సతీమణి అందుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి..

తెలంగాణ నుంచి పసుపులేటి హనుమంతరావు (వైద్య రంగం), బి.రామకృష్ణారెడ్డి(సాహిత్యం, విద్య), డాక్టర్‌ మోదడుగు విజయ్‌ గుప్తా(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), ఆంధ్రప్రదేశ్‌ నుంచి చింతలపాటి వెంకటపతి రాజు( కళారంగం), కోట సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ రావు (సామాజిక సేవ), ప్రొఫెసర్‌ ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య) పద్మశ్రీలు స్వీకరించారు.

పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారం రాత్రి విందు దిల్లీలో ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని