ఓటరు కార్డు-ఆధార్‌ అనుసంధానానికి మరో ఏడాది గడువు

ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఏప్రిల్‌ 1తో ముగిసిపోయే ఈ అనుసంధాన సమయాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Published : 23 Mar 2023 03:33 IST

ఈనాడు, దిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఏప్రిల్‌ 1తో ముగిసిపోయే ఈ అనుసంధాన సమయాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి వ్యక్తీ తన ఆధార్‌ నంబరును 6బి దరఖాస్తు ద్వారా రిజిస్ట్రేషన్‌ అధికారికి తెలియజేయాలి. దీనిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించడానికీ వీలుంది. ఎన్‌వీఎస్‌పీ, వీహెచ్‌ఏ లాంటి పోర్టళ్లు, యాప్‌ల ద్వారా స్వీయ ధ్రువీకరణతో 6బి దరఖాస్తును ఆన్‌లైన్‌లో భర్తీ చేయొచ్చు. నమోదిత మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా ఆధార్‌ను ధ్రువీకరించడానికి వీలుంటుంది. ఒకవేళ స్వీయ ధ్రువీకరణ సాధ్యం కాకపోతే అవసరమైన పత్రాలతో 6బిని అప్‌లోడ్‌ చేయొచ్చు. ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడం పూర్తిగా స్వచ్ఛందమని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. ఒకవేళ ఓటరుకు ఆధార్‌ నంబరు లేకపోతే 6బి దరఖాస్తులో పేర్కొన్న ఇతర 11 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదైనా ఒకదాని నకలును సమర్పించవచ్చని తెలిపింది. ఆధార్‌ నంబరును సమర్పించలేదన్న కారణంతో అధికారులెవ్వరూ ఓటరు జాబితానుంచి పేర్లు తొలగించడానికి వీల్లేదని ఈసీ స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని