అమృత్‌పాల్‌కు వివాహేతర సంబంధాలు

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఖలిస్థాన్‌ గురించి మాట్లాడే అతనికి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

Updated : 24 Mar 2023 05:57 IST

బయటపడిన ఛాటింగ్‌లు, వాయిస్‌ నోట్‌లు
అతడి గతచరిత్రను తవ్వుతున్న పోలీసులు
పంజాబ్‌లో కల్లోలం సృష్టించే ప్రణాళికలో ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తింపు
ఆశ్రయమిచ్చిన ఓ మహిళ అరెస్టు

చండీగఢ్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఖలిస్థాన్‌ గురించి మాట్లాడే అతనికి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్‌లు, వాయిస్‌నోట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్‌ నోట్‌లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటిల్లో మహిళలతో టైంపాస్‌ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది.

అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం వేటను కొనసాగిస్తున్న పోలీసులు మరోపక్క అతడి గత చరిత్రను తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తాజాగా అమృత్‌పాల్‌ తన బైకును మరో వాహనంపై పెట్టి ప్రయాణిస్తున్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతడి భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

పాక్‌ నుంచి ఆయుధాల సేకరణ

అమృత్‌పాల్‌ పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి ‘ఎన్డీటీవీ’కి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్‌లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌ ఐఎస్‌ఐ సాయంతో ఇప్పటికే తెప్పించిన ఆయుధాలను డీఅడిక్షన్‌ సెంటర్లు, జల్‌పూర్‌ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు.

సేకరించిన సొమ్ముకు లెక్కాపత్రం లేదు..

‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ ఆధ్వర్యంలో ఖల్సా వాహీర్‌ వంటి కార్యక్రమం నిర్వహించి సేకరించిన మొత్తానికి అమృత్‌పాల్‌ వద్ద ఎటువంటి లెక్కాపత్రం లేదు. ఖలిస్థాన్‌ పేరిట సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని అధికార వర్గాలు చెప్పాయి.

ఇతర రాష్ట్రాల వారిపై అసహనం పెంచడం..

పంజాబ్‌ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడం అమృత్‌పాల్‌ అజెండాగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ నుంచి పొట్టపోసుకొనే కూలీలపై స్థానికంగా వ్యతిరేకత పెంచేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందర్‌పూర్‌ ఖల్సా ఫౌజీ సాయంతో ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉద్రిక్తతలు పుట్టించాలన్నది అమృత్‌పాల్‌ ప్రణాళికగా తెలుస్తోంది. దీంతోపాటు పంజాబ్‌ యువతలో తుపాకీ సంస్కృతిని పెంచేందుకు అమృత్‌పాల్‌ ప్రయత్నించాడు. అందుకోసం గురువుల బోధనలను వక్రీకరించేందుకు యత్నించాడు.

మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం..

అమృత్‌పాల్‌ వేట ఇప్పుడు మహారాష్ట్రకు కూడా విస్తరించింది. తాజాగా నాందేడ్‌ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలపై దృష్టిపెట్టారు. దీంతోపాటు మహారాష్ట్ర ఏటీఎస్‌ పోలీసులు కూడా హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే అమృత్‌పాల్‌కు సంబంధించిన ఏడు రకాల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

పంజాబ్‌ పోలీసులకు నిందితురాలి అప్పగింత

హరియాణా కురుక్షేత్ర జిల్లాలో అమృత్‌పాల్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను బల్జీత్‌ కౌర్‌గా పేర్కొన్న హరియాణా పోలీసులు... అమృత్‌పాల్‌, అతని సహచరుడు పాపల్‌ప్రీత్‌ సింగ్‌కు ఆదివారం షాహాబాద్‌లోని తన ఇంట్లో ఆ మహిళ ఆశ్రయం ఇచ్చిందని చెప్పారు. నిందితురాలిని పంజాబ్‌ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు.


ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అరెస్టు

అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీలో భాగమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లూధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలోని మంగేవాల్‌ గ్రామానికి చెందిన తేజిందర్‌ సింగ్‌ గిల్‌... అమృత్‌పాల్‌ సింగ్‌కు వ్యక్తిగత భద్రత కల్పించే వారిలో ఒకరని చెప్పారు. అమృత్‌ కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు చిక్కినట్లు వివరించారు. మరోవైపు, పోలీసులు అదుపులోకి తీసుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌ సోదరుడు హర్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు 11 మంది సహచరులను గురువారం పంజాబ్‌లోని బాబా బకాలా కోర్టులో హాజరుపరిచారు. ఆయుధాల కేసులో అంతకుముందు న్యాయస్థానం.. వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపగా గురువారంతో గడువు ముగిసింది.

 


ప్రత్యేక సెల్‌, భద్రత

అసోంలోని దిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న అమృత్‌పాల్‌ సింగ్‌ మేనమామ హర్జిత్‌ సింగ్‌, ఏడుగురు అనుచరులను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వారందరినీ సీసీటీవీ నిఘా పరిధిలో ఉంచారు. జైలు వెలుపలి ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను ఎలైట్‌ బ్లాక్‌ పాంథర్‌ అసోం పోలీసు కమాండోల బృందానికి అప్పగించామని ఉన్నతాధికారులు తెలిపారు. కారాగారం అంతర్గత భద్రతా బాధ్యతలను, అసోం పోలీసు సిబ్బంది, జైలు గార్డులకు ఇచ్చినట్లు వివరించారు.

ఇంటర్నెట్‌ ఆంక్షల సండలింపు...

అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం వేట ప్రారంభించినప్పుడు నిలిపేసిన మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను అమృత్‌సర్‌లోని మోగా, సంగ్రూర్‌, అజ్నాలా, మొహాలిలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి పునరుద్ధరించారు. తరన్‌ తారన్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో మాత్రం నిలిపివేతను శుక్రవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. 


 దర్యాప్తునకు ఆదేశించిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో ఖలిస్థాన్‌ అనుకూలురు ర్యాలీ నిర్వహించిన ఘటనపై ముఖ్యమంత్రి భుపేశ్‌ బఘేల్‌ గురువారం పోలీసు దర్యాప్తునకు ఆదేశించారు. సంఘవిద్రోహ కార్యకలాపాలను ఉపేక్షించేదిలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. నిందితులపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని