సీబీఐకి కొత్త చట్టం తీసుకురావాలి

ప్రస్తుత చట్టం ప్రకారం సీబీఐకి అనేక పరిమితులున్నాయని, ఆ సంస్థకు మరిన్ని స్పష్టమైన అధికారాలు, హోదా, విధులను నిర్దేశిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.

Published : 24 Mar 2023 04:25 IST

పార్లమెంటరీ కమిటీ సిఫార్సు

దిల్లీ: ప్రస్తుత చట్టం ప్రకారం సీబీఐకి అనేక పరిమితులున్నాయని, ఆ సంస్థకు మరిన్ని స్పష్టమైన అధికారాలు, హోదా, విధులను నిర్దేశిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. తమ భూభాగాల పరిధిలో కేసుల దర్యాప్తునకు కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సమ్మతిని నిరాకరిస్తున్న నేపథ్యంలో కమిటీ ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి తమ సమ్మతిని తిరస్కరించాయి. దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎస్‌పీఈ)చట్టం కింద 1963లో ఆవిర్భవించిన కేంద్ర దర్యాప్తు సంస్థ మూలాలు స్వాతంత్య్రానికి ముందు నాటి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్నాయి. న్యాయ, ప్రజాఫిర్యాదులు, ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలకు సంబంధించి ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం... డీఎస్‌పీఈ చట్టం ప్రకారం సీబీఐ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సంస్థకు మొత్తం 7,295 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 1,709 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. సీబీఐ..తన సిబ్బంది, అధికారుల నియామకాలకు కేంద్ర సాయుధ పోలీస్‌ దళాలు, రాష్ట్రాల పోలీస్‌ శాఖల నుంచి వచ్చే డిప్యుటేషన్లపై ఆధారపడాల్సి వస్తోందని వివరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తన వార్షిక నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే విషయాన్నీ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని