రాహుల్‌కు రెండేళ్ల జైలు

ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేరీతిలో వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’

Published : 24 Mar 2023 05:39 IST

మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్‌ కోర్టు తీర్పు
అప్పీలుకు 30 రోజుల గడువు.. అప్పటివరకు శిక్ష నిలిపివేత

సూరత్‌: ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేరీతిలో వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ గురువారం తీర్పు వెలువరించారు. ‘‘నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్పశిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని గతంలో నిందితుడు వ్యాఖ్యానించి, క్షమాపణలు చెప్పిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అయినా ఆయన ప్రవర్తనలో మార్పేమీ ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య ద్వారా పరువునష్టం కలిగించారని చెప్పారు.

కోర్టులోనే ఉన్న రాహుల్‌

తీర్పు వెలువడే సమయంలో రాహుల్‌ కూడా కోర్టులోనే ఉన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తన కర్తవ్యంలో భాగంగా ప్రసంగం చేశానని ఆయన కోర్టుకు చెప్పారు. తనకు ఎవరిపట్లా వివక్ష లేదన్నారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం రాహుల్‌కు లేనందున స్వల్పశిక్ష మాత్రమే విధించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చింది. సత్యం, అహింసల గురించి మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దావా వేసిన భాజపా శాసనసభ్యుడు పూర్ణేశ్‌ మోదీ ఈ తీర్పును స్వాగతించారు.

ఇదీ కేసు నేపథ్యం

వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీల గురించి 2019 ఎన్నికల ప్రచారం వేళ కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ ప్రస్తావించారు. ఆ సందర్భంగా మోదీ అనే పేరు గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పరువునష్టం దావా దాఖలైంది. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని కోర్టుకు రాహుల్‌ నివేదించినట్లు ఆయన తరఫు న్యాయవాది జిగ్నేష్‌ తెలిపారు. కేంద్రం జడ్జీలను మారుస్తున్నప్పుడే ఇలాంటి తీర్పు వస్తుందని తమకు తెలుసని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.


ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌

నేడు రాష్ట్రపతితో భేటీ

దిల్లీ: తమ అగ్రనేత రాహుల్‌గాంధీకి జైలుశిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. శుక్రవారం పలు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ కానుంది. ఈ మేరకు తమకు సమయం కేటాయించాల్సిందిగా ఆమెను కోరింది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలపనుంది. న్యాయపోరాటం చేయడంతో పాటు రాజకీయంగానూ ఉద్యమిస్తామని పార్టీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు