సంక్షిప్త వార్తలు (11)
కొవిడ్ సమయంలో జైళ్ల నుంచి విడుదలైన దోషులు, విచారణ ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది.
ఆ ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపొవాలి: సుప్రీం
దిల్లీ: కొవిడ్ సమయంలో జైళ్ల నుంచి విడుదలైన దోషులు, విచారణ ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కొవిడ్ సమయంలో అత్యవసర బెయిల్‌పై విడుదలైన వారు- లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చునని పేర్కొంది.
సిసోదియా బెయిల్‌పై తీర్పు రిజర్వ్
దిల్లీ: మద్యం కేసులో అరెస్టయి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు రిజర్వులో ఉంచింది. సిసోదియా చేసిన రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌కు నోట్‌ను కూడా అందజేసింది. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 21వ తేదీన కూడా విచారణ జరిగింది.
ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు
ఈనాడు, దిల్లీ:రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివిధ రాష్ట్రల ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ, తమిళనాడు, గోవా, ఒడిశా, దిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, దమన్ దీవూ ఎంపీలను ఆహ్వానించారు. విందులో తెలంగాణ నుంచి భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రాములు, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వందే భారత్ రైళ్ల తయారీకి రష్యా కంపెనీల టెండర్లు
ఈనాడు, దిల్లీ: భారత దేశ ప్రమాణాలకు తగినట్లు 200 వందేభారత్ రైళ్ల తయారీకి రష్యాకు చెందిన కంపెనీలు టెండర్లు వేశాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. జాయింట్ స్టాక్ కంపెనీ లోకోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో కలిపి రష్యాకు చెందిన జేఎస్‌సీ మెట్రో వాగన్‌మష్, మితీష్‌చి కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతేడాది నవంబరు 30న ఆ టెండర్లు తెరిచామని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం
ఈనాడు, బెంగళూరు : ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా జనసంఖ్య అనుగుణంగా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలోనే ముస్లింలకు ప్రస్తుతం ఓబీసీ కోటాలోని 4శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసి, ఆర్థిక వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా ద్వారా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. 3ఏ- కేటగిరీలో ఉన్న ఒక్కలిగరలను ‘2సీ’ లోనికి చేర్చి 6 శాతం, ‘3బీ’ లోని వీరశైవ లింగాయత్‌లను ‘2డీ’ లోనికి చేర్చి 7 శాతం రిజర్వేషన్‌ను అమలయ్యేలా చేస్తామన్నారు. గతంలో ఈ రెండు సముదాయాలకు వరుసగా 4 శాతం, 5 శాతం రిజర్వేషన్ ఉంది. ఇటీవల పెంచిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌నూ తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్‌లో చర్చకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖకు సభ ప్రతిపాదన పంపింది.
బిల్కిస్ కేసు విచారణకు కొత్త ధర్మాసనం
దిల్లీ: గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై జరిగిన సామూహిక అత్యాచారం, ఏడుగురు కుటుంబసభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై విచారణకు సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం మార్చి 27న విచారణ చేపడుతుంది.
గోధ్రా అప్పీళ్లపై ఏప్రిల్ 10న..
2002 నాటి గోధ్రా రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న పలువురు దోషుల బెయిల్ పిటిషన్లను ఏప్రిల్ 10న పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున కోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం నమోదు చేసుకొంది.
రాహుల్ అధికార బంగళా ఖాళీ చేయాల్సిందేనా!
దిల్లీ: పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితమైన రాహుల్ గాంధీకి క్రిమినల్ పరువు నష్టం కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించకపోతే.. ఆయన దిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. 2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్‌కు తుగ్లక్ లైనులోని 12వ నంబరు బంగళాను కేటాయించారు. రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప మార్చి 23 నుంచి నెలరోజుల్లోపు తన అధికార బంగళాను ఆయన ఖాళీచేయక తప్పదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భద్రతా బందోబస్తును తగ్గించినందున ఆమె కూడా 2020 జూలైలో తన అధికార బంగళాను ఖాళీచేశారు.
బీజీ-2 పత్తి విత్తనాల ధర రూ.43 పెంపు
ఈనాడు, దిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీటీ పత్తి విత్తనాల ధరలను నిర్ణయిస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 475 గ్రాముల బీజీ-1 పత్తి విత్తనాల గరిష్ఠ చిల్లరధరను రూ.635, బీజీ-2 విత్తనాల గరిష్ఠ ధరను రూ.853గా నిర్ణయించింది. ఇందులో బీజీ-1 ధర గత ఏడాదిలాగే ఉండగా, బీజీ-2 ధర రూ.810 నుంచి రూ.853కు పెంచింది. నిత్యావసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్ 3, కాటన్ సీడ్ కంట్రోల్ ఆర్డర్ 2015 క్లాజ్ 5(1)లోని అధికారాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ విత్తనాల ధరను నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఈ ధరలు దేశవ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి వర్తిస్తాయని తెలిపింది.
ఆరు నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు
టోల్‌ప్లాజాల స్థానంలో కొత్త సాంకేతికత
దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతమున్న టోల్‌ప్లాజాలు ఇకముందు కనిపించవు. టోల్ రుసుం వసూలుకు వాటి స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జీపీఎస్ ఆధారిత విధానం అందుబాటులోకి రానుంది. ఆరు నెలల్లో ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల కచ్చిత దూరాన్ని లెక్కగట్టి అందుకు అనుగుణంగా రుసుమును వసూలు చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. శుక్రవారం దిల్లీలో సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
లండన్‌లో భారత హైకమిషన్‌పై దాడి.. కేసు నమోదుచేసిన దిల్లీ పోలీసులు
దిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఈ నెల 19న ఖలిస్థానీవాదుల దుశ్చర్యపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. భారత శిక్షాస్మృతి(ఐపీసీ) చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం, ప్రభుత్వ ఆస్తులపై దాడుల నివారణ చట్టం కింద ఈ కేసు నమోదు చేశారు. విదేశాల్లోని భారత జాతీయులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఈ చట్టాలను ప్రయోగిస్తారు. లండన్ ఘటనపై విదేశాంగ శాఖ నివేదికను పురస్కరించుకుని హోంశాఖ దిల్లీ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీలోని బ్రిటిష్ ఉప హైకమిషనర్‌ను పిలిచి లండన్‌లోని భారత హైకమిషన్ వద్ధ భద్రత లోపించడంపై సంజాయిషీ అడిగింది. బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష వైఖరి ఆమోదయోగ్యం కాదని తెలిపింది. భారత హైకమిషన్ భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం వివరించింది. ఈ ఘటనపై లండన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అరుణాచల్, నాగాలాండ్‌లో ‘అఫ్సా’ పొడిగింపు
దిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టా (ఆఫ్సా)న్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కల్లోలిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనిక బలగాలకు విస్తృత అధికారాలు కల్పించడం దీని ఉద్దేశం. ఆయా చోట్ల అవసరమనుకుంటే భద్రతాధికారులు సోదాలు, అరెస్టులు నిర్వహించడానికి, కాల్పులు జరపడానికి అధికారాలు లభిస్తాయి.
ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ల పొడిగింపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్‌ను కేంద్రం సెప్టెంబరు 30 వరకూ పొడిగించింది. అలాగే రెన్యువల్ కోసం దాఖలు చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న సంస్థల లైసెన్సులనూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. విదేశాల నుంచి విరాళాలు అందుకునే సంస్థలు ఎఫ్‌సీఆర్‌ఏ కింద తప్పనిసరిగా నమోదై ఉండాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TSPSC: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం
-
India News
Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం
-
Crime News
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం