నిషిద్ధ సంస్థలో సభ్యులైతే నేరస్థులే: సుప్రీం

ఒక వ్యక్తి నిషిద్ధ సంస్థలో సభ్యుడైనంత మాత్రాన అతడిని నేరస్థుడిగా పరిగణించతగదని, అతడు హింసకు పాల్పడినప్పుడు లేదా ఇతరులను హింసకు ప్రేరేపించినప్పుడే నేరస్థుడిగా పరిగణించాలని 2011లో తాను ఇచ్చిన తీర్పులు సక్రమమైనవి కావని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

Published : 25 Mar 2023 04:07 IST

దిల్లీ: ఒక వ్యక్తి నిషిద్ధ సంస్థలో సభ్యుడైనంత మాత్రాన అతడిని నేరస్థుడిగా పరిగణించతగదని, అతడు హింసకు పాల్పడినప్పుడు లేదా ఇతరులను హింసకు ప్రేరేపించినప్పుడే నేరస్థుడిగా పరిగణించాలని 2011లో తాను ఇచ్చిన తీర్పులు సక్రమమైనవి కావని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. నిషిద్ధ సంస్థ సభ్యుడు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం (యూఏపీఏ) కింద నేరస్థుడేనని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 1987 నాటి టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధ చట్టం (టాడా) కింద ఏర్పాటైన టాడా కోర్టు అస్సాం తీవ్రవాద సంస్థ ఉల్ఫా సభ్యుడైన ఆరూప్‌ భుయాన్‌ను నేరస్థుడిగా తీర్మానించింది. దీనిపై సుప్రీంకు అప్పీలుకు వెళ్లగా కేవలం ఓ నిషిద్ధ సంస్థలో సభ్యుడైనంత మాత్రాన ఏ వ్యక్తినీ నేరస్థుడిగా పరిగణించకూడదంటూ భుయాన్‌ను 2011 ఫిబ్రవరి 3న నేర విముక్తి చేసింది. అదే సంవత్సరం ఇందిరా దాస్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ అస్సాం, స్టేట్‌ ఆఫ్‌ కేరళ వర్సెస్‌ రనీఫ్‌ కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇదే విధమైన తీర్పులు ఇచ్చింది.  తరవాత టాడా చట్టం రద్దయింది. పాత తీర్పులను సమీక్షించాలని కేంద్రం, అస్సాం ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం మన్నించింది. నిషిద్ధ సంస్థలో సభ్యుడైతే చాలు యూఏపీఏ చట్టం కింద నేరస్థుడేనని సుప్రీం స్పష్టం చేస్తూ తన పాత తీర్పులను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని