కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి 4% డీఏ, డీఆర్‌ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.

Published : 25 Mar 2023 04:07 IST

జనవరి 1 నుంచి వర్తింపు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి 4% డీఏ, డీఆర్‌ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రస్తుతమున్న 38% డీఏ 42%కి పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.12,815.60 కోట్ల అధికభారం పడనుంది. ఈ పెంపు వల్ల 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుంది. 7వ వేతనసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ పెంపును అమలు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ మీడియాకు తెలిపారు.

ముడి జనపనార ఎంఎస్పీ రూ.300 పెంపు

ముడి జనపనార కనీస మద్దతుధరను క్వింటా రూ.4,750 నుంచి రూ.5,050కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనివల్ల రైతులకు పెట్టుబడిపై 63% లబ్ధి చేకూరి, 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఉజ్వలపై మరో ఏడాది రాయితీ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులకు ఒక్కో సిలిండరుపై ఇస్తున్న రూ.200 రాయితీని మరో ఏడాది కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా 12 సిలిండర్ల వరకు ఒక్కోదానికి రూ.200 చొప్పున రాయితీ వర్తిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు