వయనాడ్‌ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ స్థానం ఖాళీ అయినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

Updated : 25 Mar 2023 04:43 IST

దిల్లీ, వయనాడ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ స్థానం ఖాళీ అయినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికను ప్రకటించవచ్చు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్‌గాంధీ పోటీకి అనర్హుడు అవుతారు. నేరపూరిత పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం విదితమే. తాజా ఖాళీతో కలిపి ఇపుడు ఖాళీల సంఖ్య మూడుకు పెరిగినట్లు లోక్‌సభ వెబ్‌సైట్‌ సూచిస్తోంది. జలంధర్‌, లక్షద్వీప్‌ స్థానాలకు వయనాడ్‌ కూడా జత కలిసింది. కాంగ్రెస్‌ సభ్యుడు సంతోఖ్‌సింగ్‌ చౌధరి ఆకస్మిక మరణంతో పంజాబ్‌లోని జలంధర్‌ స్థానం ఖాళీ కాగా, ఎన్సీపీ సభ్యుడు మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు పడటంతో లక్షద్వీప్‌ స్థానం ఖాళీ అయింది. హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2019 వరకు యూపీలోని అమేఠీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ, వయనాడ్‌ స్థానాల నుంచి పోటీ చేశారు. అమేఠీలో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ రాహుల్‌ను ఓడించగా, రెండోస్థానమైన వయనాడ్‌లో ఆయన గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని