Rahul Gandhi : రాహుల్‌పై వేటు నిలబడుతుందా..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష ఖరారవడం, ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి.

Updated : 25 Mar 2023 07:34 IST

ఉన్నత న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుంది?
మహమ్మద్‌ ఫైజల్‌ కేసులో ఏమైందంటే..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష ఖరారవడం, ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత ఏం జరగబోతోందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనా? పైకోర్టులో అప్పీలు చేసుకుంటే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో- రాహుల్‌ తరహా పరిస్థితులు ఎదుర్కొన్న లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ కేసులో ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.

ఏంటీ ఫైజల్‌ కేసు?

పి.పి. మహమ్మద్‌ ఫైజల్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన లక్షద్వీప్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో మహమ్మద్‌ సలీహ్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై ఫైజల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగింది. చివరకు ఈ ఏడాది జనవరి 10న కవరత్తీ సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను దోషిగా తేల్చి.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో- ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం నుంచి జనవరి 13న ఓ ప్రకటన వెలువడింది. ఫైజల్‌పై వేటు కారణంగా ఖాళీ అయిన లక్షద్వీప్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

హైకోర్టులో ఉపశమనం

సెషన్స్‌ కోర్టు తీర్పును వెంటనే కేరళ హైకోర్టులో ఫైజల్‌ సవాలు చేశారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించింది. సెషన్స్‌ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. స్టే కారణంగా.. ఆయనకు అనర్హత వేటు వర్తించదని తెలిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫైజల్‌పై అనర్హత వేటుతో తలెత్తే అసాధారణ, మార్చలేని పరిణామాల దృష్ట్యా తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. దేశ ఖజానాకు భారమయ్యే ఉప ఎన్నికను నివారించేందుకు ఇలా చేయడం అవసరమని చెప్పింది. ఉప ఎన్నికల వల్ల లక్షద్వీప్‌లో అభివృద్ధి పనులు కొన్ని వారాలపాటు ఆగిపోతాయంది. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ పదవీకాలం కూడా తక్కువే ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులకు రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తుందని, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని నాడు కేంద్రం చేసిన వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. లోక్‌ప్రహారీ వర్సెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో 2018 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. అప్పటి నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు- లక్షద్వీప్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని ఫైజల్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఫలితంగా ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

అయినా సందిగ్ధతే

ఫైజల్‌కు అనర్హత వేటు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ.. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. ఫలితంగా ఈ కేసులో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు దోషిగా తేలి రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందని ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేయగా.. అప్పీలుపై స్పష్టత వచ్చేవరకూ అది వర్తించదని హైకోర్టు పేర్కొంది. ఈ సందిగ్ధత నడుమ రాహుల్‌ అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


జైలు శిక్ష తీర్పు తర్వాత.. లోక్‌సభకు రాహుల్‌ గాంధీ

దిల్లీ: మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి జైలుశిక్ష పడిన నేపథ్యంలో శుక్రవారం ఆయన పార్లమెంటుకు వస్తారా.. రారా..! అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఉదయమే పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారు. ఆ తర్వాత లోక్‌సభకూ వెళ్లారు. అదానీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగడంతో సభ.. సమావేశమైన కొన్ని క్షణాలకే వాయిదా పడింది. దీంతో రాహుల్‌ పార్లమెంటును విడిచి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని