శిక్ష పడి అనర్హులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందరో..
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు.. అంతకుమించి శిక్ష పడిన చట్టసభ సభ్యులు అనర్హత వేటుకు గురవుతారు.
దిల్లీ: ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు.. అంతకుమించి శిక్ష పడిన చట్టసభ సభ్యులు అనర్హత వేటుకు గురవుతారు. అంతేకాదు, శిక్షాకాలం ముగిసిన తర్వాత వారు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీల్లేదు. ఈ సెక్షన్ కారణంగా.. గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలెందరో. అందులో కొంతమంది ప్రముఖులను పరిశీలిస్తే..
లాలూప్రసాద్ యాదవ్
దాణా కుంభకోణం కేసులో 2013 అక్టోబరు 3న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూను దోషిగా తేల్చింది. మరుసటి రోజే ఈ ఆర్జేడీ అధినేత లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది.
జయలలిత
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో 2014లో జయలలిత తన శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆమె తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
మహమ్మద్ ఫైజల్
లక్షద్వీప్ నియోజకవర్గ ఎన్సీపీ ఎంపీ. ఓ హత్యా ప్రయత్నం కేసులో స్థానిక న్యాయస్థానం ఈయనకు ఈ ఏడాది జనవరిలో పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఫైజల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. తదనంతరం శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా తన అనర్హత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు లోక్‌సభ సచివాలయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదని ఫైజల్ చెబుతున్నారు.
ఆజంఖాన్
విద్వేష ప్రసంగాల కేసులో ఈ సమాజ్‌వాదీ పార్టీ నేతకు 2022 అక్టోబరులో మూడేళ్ల జైలుశిక్ష పడింది. రాంపుర్ సదర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యేపై ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ వేటు వేసింది.
అనిల్ కుమార్ సాహ్ని
ఈయన ఆర్జేడీ ఎమ్మెల్యే. కుర్హానీ శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఈ ఎమ్మెల్యేపై అక్టోబరు 2022లో బిహార్ శాసనసభ వేటు వేసింది. ఇందుకు కారణం.. ఓ మోసం కేసులో న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించడమే.
విక్రమ్‌సింగ్ సైనీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖతౌలీ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో విక్రమ్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2022లో ఈయన తన శాసనసభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ప్రదీప్ చౌధరి
హరియాణాలోని కాల్కా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఓ దాడి కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడడంతో ఇతనిపై హరియాణా శాసనసభ వేటు వేసింది
కుల్దీప్‌సింగ్ సెంగర్
ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే. ఉన్నావ్‌లోని బాంగర్‌పుర్ నుంచి ఎన్నికైన ఈయన అత్యాచారం కేసులో శిక్ష పడడంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
అబ్దుల్లా ఆజంఖాన్
యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ తనయుడు. రాంపుర్‌లోని స్వార్ శాసనసభ ఎమ్మెల్యే. ఓ పాత కేసులో 2023లో అబ్దుల్లాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో అనర్హతకు గురయ్యారు.
అనంత్ సింగ్
బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే. ఆయుధాల కేసులో శిక్షతో జులై 2022లో శాసనసభ సభ్యత్వానికి దూరమయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
Snehasish Ganguly: ప్రపంచకప్ లోపు కవర్లు కొనండి: స్నేహశిష్ గంగూలీ
-
Politics News
దేవినేని ఉమా వైకాపాకు అనుకూల శత్రువు: వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
AC Blast: ఇంట్లో ఏసీ పేలి మహిళా ఉద్యోగి మృతి
-
Ap-top-news News
Nellore: అధికారుల తీరుకు నిరసనగా.. చెప్పుతో కొట్టుకున్న సర్పంచి