సంక్షిప్త వార్తలు (10)

ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన తనపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

Updated : 26 Mar 2023 06:01 IST

అనర్హతపై సుప్రీంకు లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌

దిల్లీ: ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన తనపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తనకు విధించిన శిక్షను కేరళ హైకోర్టు సస్పెండు చేసిందని, అయినా లోక్‌సభ సెక్రటేరియట్‌ తనపై అనర్హతను ఎత్తివేయలేదని పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11వ తేదీన కవరత్తి సెషన్స్‌ కోర్టు ఫైజల్‌కు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అదే నెల 13వ తేదీన ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత ఆయన తన జైలు శిక్షను కేరళ హైకోర్టులో సవాలు చేశారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


చౌకబారు ప్రచారానికి కాంగ్రెస్‌ యత్నం
కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌

దిల్లీ: రెండేళ్లు, అంతకుమించిన శిక్ష పడినసభ్యులు అనర్హతకు గురవుతారనీ, ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీది చౌకబారు ప్రచార ఎత్తుగడ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ విమర్శించారు. ఇందులో కేంద్రానికి, లోక్‌సభకు ఎలాంటి పాత్ర లేదన్నారు.


మీడియాపై ఇదేనా విశ్వాసం?: భాజపా

రాహుల్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్న వేసిన విలేకరి మీద ఆయన ఆగ్రహించడాన్ని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ, పార్టీ ఐటీ విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ తప్పుబట్టారు. ప్రశ్న వేసిన వ్యక్తిని భాజపా ప్రతినిధిగా చెప్పడం తగదన్నారు.


సీబీఐ విచారణకు తేజస్వి.. ఈడీ ముందుకు మీసా

దిల్లీ: ‘భూములకు ఉద్యోగాలు’ కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీలు వేగం పెంచాయి. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నాయకుడు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను శనివారం సీబీఐ సుమారు 8 గంటలు విచారించింది. ఇదే కేసులో యాదవ్‌ సోదరి, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాదాపు 6 గంటలు ప్రశ్నించింది. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసినట్లు తెలిసింది.


సిసోదియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 5కు వాయిదా

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 6న తీర్పు వెల్లడించనుంది. నగదు అక్రమ చలామణీ వ్యతిరేక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద సిసోదియాను ఈడీ అరెస్టు చేయగా.. ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన విషయం విదితమే. సిసోదియా బెయిల్‌  పిటిషన్‌ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట శనివారం విచారణకు వచ్చింది. దిల్లీ మద్యం విధానంలో సిసోదియాదే కీలక పాత్ర అని, ఇతర నిందితులను విచారిస్తున్న ప్రస్తుత దశలో ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దంటూ ఈడీ తరఫు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని సిసోదియా తరఫు న్యాయవాదులు ప్రత్యేక జడ్జికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కు వాయిదా వేశారు. ఇదే కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ శనివారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌ చేశారు. ఏప్రిల్‌ 6న వెల్లడించనున్నట్లు తెలిపారు.


పొరపాటున పేలిన మూడు క్షిపణులు

జైసల్మేర్‌: భారత సైన్యం నిర్వహించిన సాధారణ విన్యాసాల్లో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. ఈ క్షిపణులు సమీప గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. 10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ అమితాబ్‌ శర్మ తెలిపారు. నింగిలోకి దూసుకెళ్లిన క్షిపణులు.. గాల్లోనే పేలిపోయాయని, వాటి శకలాలు పొలాల్లో పడ్డాయని పేర్కొన్నారు. రెండు అస్త్రాల శకలాలను అధికారులు గుర్తించారు. మూడో దానికోసం పోలీసులు, సైనిక సిబ్బంది గాలిస్తున్నారు.


రహదారి రణగొణ ధ్వనులతో అధిక రక్తపోటు!

దిల్లీ: రోడ్ల మీద వెలువడే రణగొణ ధ్వనులకు మితిమీరి గురికావడం వల్ల అధిక రక్తపోటు ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 40 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న 2.4 లక్షల మందిని పరిశీలించారు. మొదట్లో వీరికి అధికరక్తపోటు లేదు. సరాసరిన వీరిని 8.1 ఏళ్ల తర్వాత పరిశీలించారు. వీరి నివాస ప్రాంతం వద్ద ట్రాఫిక్‌ ధ్వనులను కొలిచారు. ఈ శబ్దాలతోపాటు వాయు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యేవారికి అధిక రక్తపోటు ముప్పు పొంచి ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఈ ఇబ్బందిని ఎదుర్కొనే అంశంపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రోడ్ల స్థితిగతులను మెరుగుపరచడం, ఎక్కువ ధ్వనులు చేయని వాహనాల పరిజ్ఞానంపై పెట్టుబడి పెట్టడం వంటివి చేయాలని పేర్కొన్నారు.


సంజయ్‌ రౌత్‌ సమాధానంపై మహారాష్ట్ర చట్టసభల అసంతృప్తి
రాజ్యసభ ఛైర్మన్‌కే నివేదించాలని నిర్ణయం

ముంబయి: సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌, శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ నీలమ్‌గొర్హె తేల్చారు. మహారాష్ట్ర శాసనసభను ‘చోర్‌ మండల్‌’ (దొంగల మండలి) అని రౌత్‌ చేసిన వ్యాఖ్యపై గత నెలలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు పంపించారు. సభా హక్కుల సంఘం కూర్పు, దాని పనితీరు, నిష్పాక్షికతల గురించి రౌత్‌ పలు ప్రశ్నలు లేవనెత్తారని నీలమ్‌గొర్హె తెలిపారు. సీనియర్‌ ఎంపీ నుంచి ఈ స్పందన సంతృప్తికరం కాదనీ, తగిన చర్య నిమిత్తం రాజ్యసభ ఛైర్మన్‌కే నివేదించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రౌత్‌ వ్యాఖ్య.. సభాహక్కుల ఉల్లంఘనేననీ, ఆయన రాజ్యసభ సభ్యుడు కావడంతో నిబంధనల ప్రకారం అదే సభకు విషయాన్ని నివేదించనున్నామని నర్వేకర్‌ చెప్పారు.


కోర్టులు వేగంగా పనిచేస్తేనే.. పర్యావరణ కేసుల సత్వర పరిష్కారం
సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక

దిల్లీ: కోర్టులు ప్రస్తుతానికంటే రెట్టింపు వేగంతో పనిచేస్తేనే పర్యావరణ సంబంధిత పెండింగు కేసులు సత్వరం పరిష్కారానికి నోచుకుంటాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. 2021లో రోజుకు సుమారు 130 చొప్పున 47,316 కేసులను పరిష్కరించినా.. ఏడాది చివరి నాటికి ఇంకా 89,305 పెండింగ్‌లో ఉండాల్సి వచ్చిందని ఆ నివేదిక వివరించింది. రోజుకు 245 కేసుల చొప్పున పరిష్కరించడమే దీనికి మార్గమని సూచించింది. ‘‘దేశవ్యాప్తంగా 2020-21 మధ్య పర్యావరణ కేసులు 4 శాతం పెరిగిపోగా.. వాటి పరిష్కార శాతం మాత్రం మరీ మందకొడిగా ఉంది. ఈ కారణంగానే కేసులు గుట్టలుగా పోగుబడుతున్నాయి. 2021లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 64,471 కేసులు నమోదవగా 59,220 కేసులు విచారణకు వెళ్లాయి. అవి పోను 1,36,621 కేసులు (పెండింగులో ఉన్న 77,401 కేసులు సహా) విచారణ దశలో ఉన్నాయి’’ అని నివేదిక తెలియజేసింది.


స్కూల్‌కు రాలేదని విశ్రాంత టీచర్‌కు షోకాజ్‌!

కోల్‌కతా: విధులకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలంటూ.. పదవీ విరమణ చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది! ఈ నెల 10న ఆయన ఉద్యోగానికి రాలేదని దానిలో పేర్కొంది. ఛటోపాధ్యాయ అనే వ్యాయామ ఉపాధ్యాయుడు 36 ఏళ్లు పనిచేసి, హుగ్లీలో పదవీ విరమణ పొందారు. తాఖీదుపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డీఏ పెంచాలనే డిమాండ్‌తో సమ్మె చేసిన ఉద్యోగుల జాబితాలో తన పేరు ఉండొచ్చని, పదవీ విరమణ చేసిన మరికొంతమంది ఉపాధ్యాయులకు, చనిపోయినవారికి కూడా ఈ తరహా నోటీసులే అందినట్లు తెలిసిందని ఆయన చెప్పారు.


లోయల మధ్య తీగల వంతెన

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారత తొలి కేబుల్‌ ఆధారిత రైల్వే వంతెన ఇది. కట్రా - బనిహాల్‌ రైల్వే మార్గంలో చుట్టూ కొండలు, లోయల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీని పొడవు 473.25 మీటర్లు. దీన్ని అంజీ ఖాద్‌ బ్రిడ్జిగా పిలుస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు