రాహుల్‌పై అనర్హత వేళ.. సుప్రీంకోర్టులో కీలక పిటిషన్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేళ సుప్రీంకోర్టులో కీలక పిటిషన్‌ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త అభా మురళీధరన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Published : 26 Mar 2023 03:59 IST

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) చెల్లుబాటుపై సవాల్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేళ సుప్రీంకోర్టులో కీలక పిటిషన్‌ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త అభా మురళీధరన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నించారు. ఈ నిబంధన కింద దోషిగా తేలిన ప్రజాప్రతినిధిని ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. సంబంధిత సభ్యునిపై మోపిన ఆరోపణల స్వభావం, నేర తీవ్రతతో సంబంధం లేకుండానే అనర్హతను అమలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంతో పాటు రాజ్యసభ, లోక్‌సభల సచివాలయాలను ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. తనను ఎనుకున్న ప్రజల తరఫున వాణిని చట్టసభల్లో వినిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉంటుందని, అధికరణం 19(1) కల్పించిన ఆ రాజ్యాంగ హక్కుకు భంగంకలిగించరాదని పేర్కొన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది వరకు దోషిగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసే ముందు మూడు నెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు ఉన్నత న్యాయస్థానాలలో అప్పీలు చేసుకోవచ్చు. న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడేది కాదు. అయితే, ఈ నిబంధనను గతంలో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో సవరణలు చేశారు. ఆ సవరణల ప్రకారమే తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని