ఆహార వృథాను అరికట్టే సెన్సర్‌

నాగాలాండ్‌ రాష్ట్రానికి చెందిన పరిశోధక విద్యార్థి ఖెంగ్‌ డౌలియు చవాంగ్‌ కనుగొన్న ఒక చిన్న పరికరం ఆహార ప్యాకేజింగ్‌ పరిశ్రమకు గొప్ప వరం కానున్నది.

Updated : 26 Mar 2023 05:55 IST

నాగాలాండ్‌ విద్యార్థి ఆవిష్కరణ

దిల్లీ: నాగాలాండ్‌ రాష్ట్రానికి చెందిన పరిశోధక విద్యార్థి ఖెంగ్‌ డౌలియు చవాంగ్‌ కనుగొన్న ఒక చిన్న పరికరం ఆహార ప్యాకేజింగ్‌ పరిశ్రమకు గొప్ప వరం కానున్నది. చవాంగ్‌ టెక్సస్‌(అమెరికా)లోని సదరన్‌ మెథడిస్ట్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి. ప్లాస్టిక్‌ తదితర సంచుల్లో నిల్వచేసిన కొంత కాలానికి ఆహారం ఆమ్లీకరణకు లోనవుతుంది. ఆమ్ల స్థాయులను పీహెచ్‌ స్థాయులంటారు. ఆమ్లీకరణ వల్ల ఆహార పదార్థాలు పాడవుతాయి. ప్రస్తుతం ఆహార పరిశ్రమ ప్రతి ఆహార ప్యాకేజిలో అంగుళం నుంచి అయిదు అంగుళాల పొడవు ఉండే పీహెచ్‌ సెన్సర్లను ఉంచి ఆహార నాణ్యతను పరీక్షిస్తోంది. చవాంగ్‌ రూపొందించిన పీహెచ్‌ సెన్సర్‌ కేవలం రెండు మిల్లీమీటర్ల పొడవు, 10 మిల్లీమీటర్ల వెడల్పు ఉంది. ఇలాంటి సెన్సర్లను ప్రతి ఆహార ప్యాకెట్‌లో ఉంచవచ్చు. తన సెన్సర్‌ను పాలు, పండ్లు, తేనె, చేపల నాణ్యతా నిర్ధారణకు విజయవంతంగా పరీక్షించినట్లు చవాంగ్‌ తెలిపారు. ఈ సెన్సర్‌ తయారీకి జీవసంబంధ పదార్ధాలను ఉపయోగిస్తారు. వార్తా పత్రికలను ముద్రించినట్లే ఈ సెన్సర్లను ముద్రించవచ్చు. తమ పీహెచ్‌ సెన్సర్‌ ఉన్న ఆహార ప్యాకెట్లను సూపర్‌ మార్కెట్‌ ద్వారాల గుండా తీసుకెళ్లేటప్పుడు, రేవుల ద్వారా ఎగుమతిచేసేటప్పుడు, బట్వాడా కేంద్రాల్లో నిల్వచేసినప్పుడు ఆహారం చెడిపోతే సెన్సర్‌ వెంటనే హెచ్చరిస్తుందని చవాంగ్‌ తెలిపారు. నాగాలాండ్‌లో వ్యవసాయ పంటలు ఈవిధంగానే చెడిపోతున్నందున దాన్ని అరికట్టడానికి పీహెచ్‌ సెన్సర్‌ను రూపొందించానని చవాంగ్‌ తెలిపారు. దీనివల్ల పిల్లలు, వృద్ధులకు మరింత ఆహారం అందించవచ్చన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని