వామపక్ష తీవ్రవాదంపై విజయం తథ్యం

వామపక్ష తీవ్రవాదంపై పోరాటం చివరి దశకు చేరిందని, విజయానికి అత్యంత చేరువలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు.

Published : 26 Mar 2023 04:52 IST

నక్సలిజం అణచివేతలో సీఆర్పీఎఫ్‌ కృషి అమోఘం
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడి

జగదల్‌పుర్‌: వామపక్ష తీవ్రవాదంపై పోరాటం చివరి దశకు చేరిందని, విజయానికి అత్యంత చేరువలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ మొత్తం కృషిలో సీఆర్పీఎఫ్‌ సిబ్బంది కీలక పాత్ర వహించడంతో పాటు మహత్తర త్యాగాలు చేసిందని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరణ్‌పుర్‌ క్యాంపులో శనివారం నిర్వహించిన కేంద్ర రిజర్వు పోలీస్‌ దళం(సీఆర్పీఎఫ్‌) 84వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి గత తొమ్మిదేళ్లుగా భద్రతా బలగాలు దృఢ సంకల్పంతో పోరాడాయన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కలుగుతున్న అవాంతరాలను తొలగించడం వీటిలో అత్యంత ముఖ్యమైనదని అమిత్‌ షా పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి ఫలాలు గిరిజనులకు చేరేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. కేంద్ర సాయుధ బలగాల విజయాలు, ప్రాణ త్యాగాలను స్వర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ‘2010తో పోల్చితే వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు 76శాతం తగ్గాయి. అదే సమయంలో ప్రాణ నష్టం 78శాతం మేర తగ్గుముఖంపట్టింద’ని కేంద్ర మంత్రి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు